• facebook
  • whatsapp
  • telegram

సీఎస్‌ఈకి ఎందుకీ క్రేజ్‌!

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి కెరియర్‌ వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో బీటెక్‌/ బీఈలో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ఎంచుకుంటున్న బ్రాంచి - కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ). ప్రస్తుతం దీనికున్న గిరాకీ మరే ఇతర బ్రాంచీకీ లేదు. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ప్రక్రియల్లో సమాచార వ్యవస్థల డిజైన్‌, అమలు, నిర్వహణకు సంబంధించిన కోర్సు సీఎస్‌ఈ. దీనిలో చేరితే ప్రోగ్రామింగ్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, డేటా స్ట్రక్చర్స్‌ లాంటి అంశాల్లో పరిజ్ఞానం లభిస్తుంది. ఈ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఐటీ పరిశ్రమ, సంబంధిత రంగాల్లోని వివిధ ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో ప్రవేశించవచ్చు! 

ఆన్‌లైన్‌లో తగినన్ని వనరులు, సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత యుగంలో విద్యార్థులకు సీఎస్‌ఈ చాలా కీలకం. రోజురోజుకూ ఆటోమేషన్‌, నాన్‌-మాన్యువల్‌ పనుల అవసరం పెరుగుతోంది. అధునాతన సాంకేతికత మానవ జీవితాన్ని సులభతరం చేస్తోంది. విద్యార్థులు సాధారణంగా కంప్యూటర్లు, మొబైల్‌ పరికరాల్లో గేమ్స్‌ ఆడుతున్నపుడూ, వనరులు శోధిస్తున్నపుడూ పొందిన అనుభవాల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఆధునిక పరికరాల అభివృద్ధికి కంప్యూటర్ల పూర్తి/ పాక్షిక వినియోగం తెలిసి ఉండాల్సిందే. సీఎస్‌ఈ రంగంలో అధిక పోటీ ఉన్నప్పటికీ ఈ కారణంగా.. మెరుగైన కెరియర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. 

కంప్యూటర్‌ సైన్స్‌- ఇంజినీరింగ్‌ అనేది అత్యంత క్రియాశీలకమైన రంగం. ఇక్కడ సంవత్సరం పొడవునా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతుంటారు. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి పరిధిలో నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి సమస్యలకు గణన పరిష్కారాలు ఎలా ఉంటాయో అన్వేషించవచ్చు. విద్యార్థులు నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో అల్గారిథమ్‌లు, విధానాలను ఉపయోగించవచ్చు.

అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మొదలైన టెక్‌ దిగ్గజాలు ఈ రంగంలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌ల పరంగా అనేక అవకాశాలను ఇస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అప్లికేషన్లు ఇతర విభాగాలతో సమర్థంగా కలుస్తాయి. కాబట్టి ఇంటర్‌ డిసిప్లినరీ సొల్యూషన్లు విస్తృత పరిధిలో ప్రభావశీలంగా పనిచేస్తాయి.

అవకాశాలు అపారం

ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్‌ సైన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పెరుగుతోన్న ప్లేస్‌మెంట్లే దీనికి నిదర్శనం. ఇప్పుడున్న పరిశ్రమల్లో అధునాతన వ్యవస్థలు, ఆటోమేషన్‌ పురోగతి సీఎస్‌ఈ రంగం గిరాకీని పెంచుతోంది. ఈరోజుల్లో మనం ఉపయోగించే ప్రతి అప్లికేషన్‌లో డేటా ప్రధాన అంశం. సీఎస్‌ఈ అనేది డేటాసైన్స్‌, ఎంఎల్‌ అనుబంధిత సబ్‌డొమైన్లతో కూడిన పెద్ద డొమైన్‌. ఏఐ, బ్లాక్‌చెయిన్‌ లాంటి అధునాతన టెక్నాలజీలు ప్రపంచ రూపురేఖలను మారుస్తున్నాయి. ప్రతి రంగంలో కంప్యూటర్ల వినియోగం ఉన్నందున సీఎస్‌ఈకి ఎంతో ప్రఖ్యాతి లభిస్తోంది.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌, విజువల్‌ రియాలిటీ అండ్‌ ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ లాంటి డొమైన్‌లలో ఎంతో సాంకేతిక పురోగతి వస్తోంది. కాబట్టి సీఎస్‌ఈ డొమైన్‌లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సీఎస్‌ఈ గ్రాఫ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉండటం వల్ల ఈ రంగంలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి.

ప్రపంచ టెక్‌ దిగ్గజాలు అయిన మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఐబీఎం లాంటివి ఎంతోమంది యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మనదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీకి తారస్థాయిలో క్రేజ్‌ ఉన్నందువల్ల సీఎస్‌ఈ విద్యార్థులు తమ నైపుణ్యాలతో లభిస్తున్న అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. సీఎస్‌ఈ కోర్సుల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ అవకాశాలు కూడా అదే క్రమంలో పెరుగుతున్నాయి. ఈ డొమైన్‌ కింద ఎన్నో అధునాతన సబ్‌ డొమైన్‌లున్నాయి. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతికతలు పెరుగుతూ అవకాశాలు కూడా భారీగా వృద్ధి చెందుతున్నాయి.

పట్టు సాధిస్తేనే..

కంప్యూటర్‌ సైన్స్‌- ఇంజినీరింగ్‌ అనేది సాహసోపేతమైన రంగంగా చెప్పవచ్చు. దీనిలో ప్రతి త్రైమాసికంలో వినూత్నమైన సాంకేతికతలను ప్రవేశపెడతారు. విద్యార్థులు వీటిని అభ్యసించి వాటిపై పట్టు సాధిస్తేనే ముందంజలో ఉంటారు.

ఈ బ్రాంచిలో ప్రధానమైన అంశం ‘ప్రోగ్రామింగ్‌’. దీన్ని వ్యావహారికంగా ‘కోడింగ్‌’ అంటారు. ముందుగా ఈ కోడింగ్‌ భాషలపై విద్యార్థులు పరిచయ కోర్సులు చదివి, తగినంత పట్టు సాధించాలి. ఈ అభ్యాసం వారిని సులువుగా కోడ్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతారు. కోడింగ్‌లో అంతిమ విజయం సాధించడానికి కావల్సింది ‘స్థిరమైన అభ్యాసం’. కోడింగ్‌లో ఆలోచన దశ సమయం తీసుకుంటుంది. లాజిక్‌ బిల్డింగ్‌ తర్వాత నిర్ణయించిన లాజిక్‌కు సరిపోయే కోడ్‌ను కనుక్కోవడం చాలా సులభం. చివరి భాగం కోసం ప్రోగ్రామింగ్‌ నిర్మాణాలు స్పష్టంగా తెలుసుకోవాలి.

కాబట్టి మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు భౌతికంగా, ఆన్‌లైన్‌ కోడింగ్‌ పోటీల్లో పాల్గొనడంపై శ్రద్ధ చూపాలి. కోడ్‌షెఫ్‌, కోడ్‌ఫోర్స్‌, లీట్‌కోడ్‌ మొదలైనవి విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్నీ, కోడింగ్‌ నైపుణ్యాన్నీ పెంచుతాయి. కోడింగ్‌లో విజయం సాధించడానికి ఇదొక అవకాశం.

హ్యాకథాన్‌ అనేది మరో అంశం. ఇక్కడ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి కంప్యూటర్‌ పరిష్కారాలను రూపొందించాలి. ఇది విద్యార్థుల్లో పని వాతావరణాన్ని కల్పిస్తుంది. కొత్త కొత్త పరిష్కారాలు తీసుకురావడానికీ, నూతన సాంకేతికతకూ సాధనాల ఆవిష్కరణ జరుగుతుంది. కోడెథాన్‌, ఐడియాథాన్‌ వీటికి మరో రూపాలు. ఇవి విద్యార్థుల తెలివితేటలనూ, సమస్యల పరిష్కార పద్ధతులనూ, ఆలోచనా సామర్థ్యాలనూ పరీక్షిస్తాయి. విద్యార్థులు నెట్‌ వర్కింగ్‌ ప్రయోజనాల కోసం, పరిజ్ఞానం, నైపుణ్యాలు పంచుకోవడం కోసం, కాన్ఫరెన్స్‌లు, సమ్మిట్‌లూ మొదలైన అవకాశాల కోసం వెతకవచ్చు. 

అధ్యాపకులు తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పరిచి ఇష్టమైన డొమైన్‌లలో శిక్షణ ఇప్పించాలి. ఆసక్తి కలిగిన విషయ పరిశోధనల్లో పత్రాలు రాయడానికి ప్రోత్సహించాలి. పేటెంట్లు, ఫెలోషిప్‌లు, ప్రాజెక్ట్‌ ఫండింగ్‌ మొదలైన వాటికోసం దరఖాస్తులను మెరుగుపరుచుకోవాలి. ఐడియాథాన్లు, టీహబ్‌, టాస్క్‌ లాంటి స్టార్టప్‌ ఇంక్యుబేషన్లు అవకాశాలకూ, విద్యార్థుల కెరియర్‌ మెరుగుపరచడానికీ ఎంతో ఉపయోగపడతాయి.

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు

‣ విదేశీ వర్సిటీల్లో ఉచిత కోర్సులు

‣ మేటి సంస్థల్లోకి.. ‘క్లాట్‌’ దారి

‣ సెక్యూరిటీ ప్రెస్‌లో 108 కొలువులు

Posted Date: 12-07-2023


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌