• facebook
  • whatsapp
  • telegram

ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

10వ తరగతి తర్వాత ఇంటర్‌ కోర్సు వివరాలుతెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో ఎంపీసీ గ్రూపును ఎంచుకుంటున్నారు. ఇంజినీరింగ్‌ విద్య లక్ష్యంగానే వీరిలో సింహభాగం ఈ గ్రూపు ఎంచుకోవడానికి కారణం. అయితే వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి దాదాపు అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనూ చేరే అవకాశం   ఈ గ్రూపు సొంతం. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశించవచ్చు. లేదా మేనేజ్‌మెంట్, టీచింగ్, లా, డిజైన్, అకౌంట్స్‌... తదితర కోర్సుల దిశగానూ వెళ్లవచ్చు. ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఉన్న అవకాశాల వివరాలు..


      ఇంజినీరింగ్‌     

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్న కోర్సు ఇదే. దశాబ్దాలుగా మన విద్యార్థులు ఇందులో రాణించడం, ఉపాధి పొందడంతో ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. వీరంతా ఐఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు కోసం పోటీ పడుతున్నారు. ఐఐటీ-జేఈఈ స్కోర్‌తో దేశవ్యాప్తంగా దాదాపు సంస్థలన్నీ ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలు సొంతమవుతుండటంతో కెరియర్‌ను మలుపు తిప్పే కోర్సుగా బీటెక్‌ నిలుస్తోంది. ఇంటర్‌ అనంతరం నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులోనూ చేరవచ్చు. ఈ విధానంలో ఐదేళ్లకే చదువు పూర్తై ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. కొన్ని ఐఐటీలతోపాటు పేరున్న ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ఈ తరహా కోర్సులు ఉన్నప్పటికీ, విద్యార్థులు బీటెక్‌ లో చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్, ఐటీ బ్రాంచీల్లోనే చేరడానికి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. 

కొన్నేళ్ల నుంచి పలు సంస్థలు సీఎస్‌ఈలో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఎల్‌), డేటా సైన్స్, బిగ్‌డేటా, సైబర్‌ సెక్యూరిటీ ...తదితర పేర్లతో కోర్సులు అందిస్తున్నాయి. వీటిపైనా విద్యార్థుల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ బ్రాంచీల్లో అవకాశం రానివాళ్లు.. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 

ఆర్మీ, నేవీలు ఏటా రెండుసార్లు 10+2 టెక్నికల్‌ ఎంట్రీ విధానంలో ఎంపీసీ విద్యార్థులను ఎంపిక చేసి, బీటెక్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. జేఈఈ స్కోరు, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు అనంతరం లెఫ్టినెంట్, సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగాలిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు. బీటెక్‌ అనంతరం ఎంఎస్‌ లేదా ఎంటెక్‌ ఆ తర్వాత పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. సీఎస్‌ఐఆర్‌ నెట్‌తో బీటెక్‌ అర్హతతోనే స్టైపెండ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. పరిశోధన, బోధనలో భాగం కావాలనుకునేవాళ్లు ఈ తరహా చదువులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బీటెక్‌ అనంతరం విదేశాల్లో ఎంఎస్‌ (పీజీ) కోర్సుల్లో చేరేవారూ ఈ మధ్య పెరుగుతున్నారు. విదేశాల్లో అందుతోన్న ఆకర్షణీయ అవకాశాలే ఇందుకు కారణం. గేట్‌ స్కోరుతోనూ పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు పెద్ద మొత్తంలో వేతనాలు అందిస్తున్నాయి. బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌తో కేంద్రంలోని ముఖ్య విభాగాల్లో ఉన్నత సేవలు అందించవచ్చు. 


    బీఎస్సీ   

ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీటెక్‌ తర్వాత ప్రాధాన్యం బీఎస్సీ కోర్సులకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీటు పొందడానికి ఎక్కువమంది పోటీ పడుతున్నారు. బీఎస్సీలో వైవిధ్య కాంబినేషన్లు ఎంచుకోవచ్చు. ఆనర్స్‌ కోర్సులూ చదువుకోవచ్చు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అందించే మూడేళ్ల బీస్టాట్, బీమ్యాథ్స్‌ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువ. చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్, చెన్నై ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ కోర్సులు పేరొందాయి. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్‌ కోర్సులు అందిస్తోంది. బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ సంస్థలు అందించే చదువులు ఉపయోగపడతాయి. గత మూడేళ్ల నుంచి బీఎస్సీలోనూ.. డేటాసైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌డేటా, ఫోరెన్సిక్‌ సైన్స్, యాక్చూరియల్‌ సైన్స్‌...మొదలైనవాటిని చేర్చారు. పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, డీమ్డ్‌ విద్యా సంస్థల్లో వీటిని అందిస్తున్నారు


     ఆర్కిటెక్చర్‌   

ఇంజినీరింగ్‌లో ప్రత్యేక విభాగం ఆర్కిటెక్చర్‌. నిర్మాణాలు, కట్టడాల్లో సృజనాత్మకత చూపడానికి ఇష్టపడేవారు, డ్రాయింగ్‌ నైపుణ్యం ఉన్నవారు ఆర్కిటెక్చర్‌ వైపు అడుగులేయవచ్చు. ఐఐటీ-జేఈఈలో మరో పేపర్‌ అదనంగా రాయడం వల్ల ఈ సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే నాటాతోనూ దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్కిటెక్చర్‌ చదువుల నిమిత్తం ప్రత్యేక సంస్థలూ వెలిశాయి. ఉన్నత విద్యలో భాగంగా బీఆర్క్‌ తర్వాత ఎంఆర్క్‌ చదువుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్లకు దేశీయంగా, విదేశాల్లోనూ మంచి అవకాశాలు దక్కుతున్నాయి.


    ఫ్యాషన్‌ టెక్నాలజీ  

విస్తరిస్తోన్న రంగాల్లో ఫ్యాషన్‌ టెక్నాలజీ ఒకటి. ఆకర్షణీయంగా, హుందాగా కనిపించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్రత్యేకతను చూపడానికి భిన్న వస్త్రాలు, ఉపకరణాలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి అవకాశాలూ పెరుగుతున్నాయి. నిఫ్ట్‌లతోపాటు పలు సంస్థలు బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ చదువులను అందిస్తున్నాయి. నిఫ్ట్‌లు నిర్వహించే ఉమ్మడి పరీక్షతో ప్రవేశం లభిస్తుంది. ఫ్యాషన్‌ రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ నాలుగేళ్ల కోర్సులో చేరవచ్చు. అనంతరం ఎంటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును ఏదైనా స్పెషలైజేషన్‌తో ఎంచుకోవచ్చు. పీజీ తర్వాత పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు.


    పైలట్‌   

ముందు ముందు మరింత వృద్ధి సాధించడానికి మార్గమున్నవాటిలో విమానయానం ఒకటి. ఈ విభాగంలో పైలట్ల సేవలే కీలకం ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు చదివితేనే పైలట్‌ శిక్షణ తీసుకోగలరు. దేశంలో పలు ప్రైవేటు సంస్థలు పైలట్‌ కోర్సు అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చుకు సిద్ధపడాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ పరీక్షతో ఉచితంగా పైలట్‌ కోర్సు పూర్తిచేసుకోవచ్చు. ఎంపికైనవారు బీటెక్‌ చదువుకుంటూనే పైలట్‌ శిక్షణ పొంది వాయుసేనలో సేవలు అందించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ఈ ప్రకటనలు వెలువడతాయి.. 


    బీఫార్మసీ  

దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫార్మసీ పరిశ్రమ ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీనీ ఎంచుకోవచ్చు. ఈఏపీసెట్‌ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ వారికి సగం చొప్పున సీట్లు కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆ తర్వాత నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత నేరుగా ఫార్మ్‌ డి కోర్సులోనూ చేరిపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి.


     ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ  

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో పలు సంస్థలు యూజీ+ పీజీ కోర్సులు అందిస్తున్నాయి. దాదాపు ప్రతి ఐఐటీలోనూ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ సీట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోరుతో భర్తీ చేస్తారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీటికి పేరు పొందింది. నెస్ట్‌తో నైసర్‌-భువనేశ్వర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. ఇలా ప్రవేశం పొందినవారు ప్రతినెల స్టైపెండ్‌ పొందవచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు ప్రారంభించాయి.


    బీఎస్‌-ఎంఎస్‌  

ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులను అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా పుట్టుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ ఐఐటీ-జేఈఈ స్కోరుతో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల్లో అవకాశం పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ పొందవచ్చు. బీఎస్‌-ఎంఎస్‌ తర్వాత పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీ వైపూ దృష్టి సారించవచ్చు.


    బీఎస్సీ ఎడ్‌  

బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో చదువుకున్న వారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. పేరొందిన సంస్థల్లో ఈ తరహా చదువులు లభిస్తున్నాయి. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు ఆరేళ్ల వ్యవధితో అందిస్తోంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఫిజికల్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్‌ల్లో బీఎస్సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. తేజ్‌పూర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ బీఎస్సీ ఎడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీయూసెట్‌ యూజీలో చూపిన ప్రతిభతో కేంద్రీయ సంస్థల్లో సీటు పొందవచ్చు. పలు ప్రైవేటు విద్యా సంస్థలూ బీఎస్సీ ఎడ్‌ చదువులు అందిస్తున్నాయి.


     ఇతర మార్గాలు...  

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న తర్వాత వేరే దారిలో వెళ్లాలనుకుంటే వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు పలు సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్‌తో ప్రముఖ న్యాయవిశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్, లిబరల్‌ స్టడీస్, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు..ఇలా ఎవరికి వారు నచ్చిన కొత్తదారిలో దూసుకుపోవచ్చు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

Posted Date: 06-06-2024


 

టెన్త్ తర్వాత

మరిన్ని