• facebook
  • whatsapp
  • telegram

వచ్చేసింది.. టెక్నో- లాయర్ ట్రెండ్ 

ఎమర్జింగ్ కెరియర్

ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎల్‌ఎల్‌బీ కోర్సుకు డిమాండ్ 

భ‌విష్య‌త్తులో భారీగా పెరగనున్న ఉద్యోగావకాశాలు

దశాబ్దం క్రితం వరకు ఎల్‌ఎల్‌బీతో బీటెక్ అధ్యయనం సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాత ఆలోచన మొదలై ఈ మధ్య కాలానికి ఒక రూపానికి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రాం ఒక ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకుంది. ఇది రెండు ప్రొఫెషనల్ విభాగాల ప్రత్యేక కలయిక. దీనిలో మెల‌కువ‌లు నేర్చుకుని అభ్యర్థులు టెక్నో లాయ‌ర్‌లుగా సిద్ధమవుతారు. ఒక సంస్థ తరఫున న్యాయ‌వాదిగా మాత్ర‌మే కాకుండా, సాంకేతిక అంశాలను అర్థం చేసుకొని ఇంజినీరింగ్ ఒప్పందాలను కుదుర్చుకోవడంలో వీరు ప్రధానపాత్ర పోషిస్తారు.  పేటెంట్ విధానాలను రూపొందిస్తారు, రక్షిస్తారు. పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న టెక్నాలజీ సంస్థల కోసం అనుకూలమైన, చట్టపరమైన సమ్మతి పరిష్కారాలను రూపొందించడానికి సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న న్యాయవాది అవసరం ఎంతో ఉంటోంది. అందుకే టెక్నోలాయర్ ఇప్పడు ఒక ఎమర్జింగ్ కెరియర్‌గా ఎదుగుతోంది. 

భవిష్యత్తు అంతా టెక్నాలజీదే. దిన‌దినాభివృద్ధి చెందుతున్న‌సాంకేతిక పరిజ్ఞానానికి ఏ రంగంతో పోటీ ఉండ‌క‌పోవ‌చ్చు. క‌రోనా మహమ్మారి ప్రభావం ఈ రంగాన్ని మ‌రింత వేగవంతం చేసింది. మారుతున్న మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, కొత్త నైపుణ్యాలను నిరంతరం నేర్చుకునే విశ్వాసం, సౌలభ్యం కలిగి ఉన్న విమర్శనాత్మక ఆలోచనాపరుల‌కు అధిక డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో మల్టీడిసిప్లినరీ నైపుణ్యాలు క‌లిగి ఉన్న వారికి డిమాండ్ బాగా ఉంటుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.

వృత్తి విద్యలో ఇంటర్-డిసిప్లినరీ ఆలోచన, ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవ‌డం, వాద‌న‌లు, పరిశోధన, ఆవిష్కరణ వంటి మార్గదర్శకాల‌ను జోడించాలని కొత్త విద్యా విధానం కూడా నొక్కి చెబుతోంది. సాంకేతిక విద్య భవిష్యత్తు కూడా మల్టీడిసిప్లినరీ విధానం వైపు దృష్టిసారిస్తోంది. దీంతో విద్యాసంస్థలు రకరకాల ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా వెలువడిందే ఈ టెక్నో లాయర్ కెరియర్.

ఎలాంటి కోర్సులు, ఏయే అర్హతలు?

సాధారణంగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్య‌ర్థులు రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్రైవేటు యూనివ‌ర్సిటీలు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించి మూడేళ్ల ఎల్ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో చేర‌వ‌చ్చు. లేదంటే ఇంట‌ర్ పూర్తికాగానే అయిదు లేదా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ చేయ‌వ‌చ్చు. ఆర్ట్స్‌(బీఏ, బీఏ హాన‌ర్స్‌, బీఎల్ఎస్‌), కామ‌ర్స్ & బిజినెస్ (బీబీఏ, బీబీఏ హాన‌ర్స్‌, బీకాం, బీకాం హాన‌ర్స్‌)‌, సైన్స్ & టెక్నాల‌జీ(బీఎస్సీ, బీఎస్సీ హాన‌ర్స్‌, బీటెక్‌) విభాగాల‌తోపాటు ఈ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. బీటెక్ ఎల్ఎల్‌బీ కోర్సు కాల‌వ్య‌వ‌ధి ఆరు సంవ‌త్స‌రాలు. మిగ‌తా విభాగాల‌తో అయితే అయిదేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. ఇంగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ చేయాల‌నుకునే విద్యార్థులు ఇంట‌ర్మీడియ‌ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ స‌బ్జెక్టుల‌తో 50% మార్కులు సాధించి ఉండాలి. ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన త‌ర్వాత అభ్య‌ర్థులు కాన్‌స్టిట్యూష‌న‌ల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, కార్పొరేట్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ లా, హ్యూమ‌న్ రైట్స్‌, ఇంటెలెక్చివ‌ల్ ప్రాప‌ర్టీ అండ్ ట్రేడ్ వంటి ప‌లు విభాగాల్లో మాస్ట‌ర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) చేయ‌వ‌చ్చు. యూనివ‌ర్సిటీలు, క‌ళాశాలల‌ను బ‌ట్టి ఫీజులుంటాయి. టెక్నో లాయర్‌గా స్థిర పడాలంటే డ్యుయల్ డిగ్రీ కోర్సులు మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. బీటెక్ లేదా బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత ప్రవేశ పరీక్షలు రాసి ఎల్ఎల్‌బీ చేసుకోవచ్చు. ముందు నుంచే ఆ కెరియర్‌పై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్-ఎల్‌ఎల్‌బీ లేదా బీఎస్సీ-ఎల్‌ఎల్‌బీ వంటి డ్యుయల్ డిగ్రీ కోర్సులపై దృష్టిసారించవచ్చు.

ప్ర‌వేశం ఎలా?

బీటెక్ లేదా బీఎస్సీలతో ఎల్ఎల్‌బీ చేయాలంటే ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు జాతీయ ప్రవేశ పరీక్షలైన క్లాట్, ఎల్‌శాట్‌ అర్హత సాధించాలి. అవే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో అయినా ర్యాంకు సాధిస్తే అడ్మిషన్ పొందవచ్చు. 

ఏ రంగాల్లో డిమాండ్?

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషి‌న్ లెర్నింగ్‌, 3-డి మిష‌నింగ్‌, బిగ్ డేటా విశ్లేషణ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో బాగా ప‌రిజ్ఞానం ఉన్న న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా న్యాయవ్యవస్థకు కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. అందుకోసమే ఆవిర్భంచి, అభివృద్ధి చెందోతోంది టెక్నో లాయర్ కెరియర్. లీగల్ సర్వీసెస్ అభివృద్ధి చెందుతుండటంతో ప్ర‌స్తుతం చాలా న్యాయ పాఠశాలల్లో బోధించని వ్యూహాత్మక ప్రణాళిక, డేటా అనలిటిక్స్, టెక్నాలజీ సపోర్ట్, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌వంటి వాటిపై అవగాహన ఉన్న టెక్నో లాయర్లకు డిమాండ్ ఎక్కువవుతోంది. బీటెక్-ఎల్ఎల్‌బీ అభ్యర్థులు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వీరి కోసం సాంకేతిక, చట్టపరమైన అవ‌కాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 

ఈ స్పెషలైజేషన్‌కు అనుకూలమైన కొన్ని కెరియర్‌లు

మేధోసంపత్తి న్యాయవాదులు(ఐపీఆర్‌): నేటి పోటీ ప్ర‌పంచంలో మేధోసంపత్తి న్యాయవాదులకు చాలా డిమాండ్ ఉంది. వీరు పేటెంట్, డిజైన్, ట్రేడ్‌మార్క్ లేదా కాపీరైట్ వంటి సృజనాత్మక ఆలోచనల‌రక్షణపై దృష్టి పెడతారు. క్లయింట్‌కు మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న న్యాయవాది ఒక వరం. ఎందుకంటే వీరు క్లయింట్‌అవసరాలను బాగా అర్థం చేసుకుని,  పేటెంట్‌హక్కులను రక్షిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై సరైన రీతిలో కోర్టలో కేసులు వేస్తారు. 

ఐపీ సొలిసిటర్: కంపెనీలు సమర్థ ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో మేధోసంపత్తి న్యాయవాదులు లేదా కన్సల్టెంట్‌లు సాయపడుతుంటారు. మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకొని  ఒక ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని, వాణిజ్య విలువను వీరు జాగ్రత్తగా అంచనా వేస్తారు. ఐపీ సొలిసిటర్ వల్ల కంపెనీలకు రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. సొంత మేధో సంసత్తి హక్కును కాపాడుకోవడంతో పాటు ఇతర పేటెంట్ హక్కలను ఉల్లంఘించకుండా సాయపడతారు. ఈ రెండు సందర్భాలు ఖర్చుతో కూడుకున్నవే. టెక్నాలజీ, ఫార్మాస్యుటికల్స్, మీడియా, వినోదరంగాల్లో ఎక్కువగా మేధోసంపత్తి వివాదాలు తలెత్తుతుంటాయి. ఇక్కడే ఐపీ సొలిసిటర్లకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

సైబర్ లా కన్సల్టెంట్స్: ఇంటర్నెట్ అనేక అవకాశాలతోపాటు ఎన్నో సవాళ్లను తెచ్చిపెడుతోంది. అవి రకరకాలు ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్‌లు, అధికారిక పరిధుల సమస్యలు, ఈ-కామర్స్ సంబంధాలు, సైబర్ నేరాలు, డొమైన్ నేమ్ వివాదాలు, సైబర్ పైరసీ, సైబర్ పరువునష్టం వంటి అనేక అంశాల్లో సైబర్ లా కన్సల్టెంట్‌లు అవసరమవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఐఓటీ (ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్), బిగ్ డేటా, మెషిన్ లర్నింగ్ వంటి అధునాత టెక్నాలజీల వల్ల కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు అంతా డిజిటల్ ఆవిష్కరణలు, సంబంధిత చట్టాలపైనే నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. 

సైబర్ ఫోరెన్సిక్స్, ఇన్వెస్టిగేషన్: నేరాలకు ఆన్ లైన్ కొత్తవేదికగా మారింది. దీని వల్ల సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ పరిశోధనలను సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కార్పొరేట్ దగాలు, దివాలా, బ్యాంకింగ్ మోసాలపై సరైన పరిశోధన చేసి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సేకరించగలిగిన వాళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో సైబర్ సాక్ష్యాలను సమర్థంగా సంపాదించి, సమర్పించగలిగిన టెక్నాలజీ లాయర్లను కంపెనీలు నియమించుకుంటున్నాయి.

స్టార్టప్‌లు: ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్న మిలీనియల్ న్యాయవాదులు అనేక విజయవంతమైన స్టార్టప్‌లను స్థాపించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  అగ్రిటెక్, బిగ్ డేటా, బిట్ కాయిన్, బ్లాక్ చెయిన్, బిల్లింగ్ అండ్ ఇన్వాయిసింగ్, బిజినెస్ ఇంటలిజెన్స్, క్లీన్ టెక్, క్రౌడ్ ఫండింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్స్, ఈ-ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇంకా అనేక అధునాతన టెక్నాలజీ రంగాల్లో స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయని స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌ విశ్లేషించింది.  ఈ అంశాలను పరిశీలిస్తే టెక్నో-లీగల్ పరిజ్ఞానంతో పారిశ్రామికవేత్తగా అవతరించడం క‌చ్చితంగా భ‌విష్య‌త్తులో రాణించేందుకు దోహ‌దం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. 

బీటెక్‌తో ఎల్ఎల్‌బీ ప్రోగ్రామ్ అందిస్తున్న సంస్థ‌లు

స్కూల్ ఆఫ్ లా, యూనివ‌ర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ స్ట‌డీస్, దెహ్రాదూన్

బీఎస్సీతో పాటు..

గుజ‌రాత్ నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ, గాంధీన‌గ‌ర్

ఎస్ఓఏ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా, భువ‌నేశ్వ‌ర్ 

కేఐఐటీ స్కూల్ ఆఫ్ లా, భువ‌నేశ్వ‌ర్ 

అమిటీ లా యూనివ‌ర్సిటీ, ముంబ‌యి

జేఈసీఆర్‌సీ యూనివ‌ర్సిటీ,జైపూర్

పొన్న‌య్య రామ‌జ‌యం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, తంజావూర్

ఓపీజేఎస్ యూనివ‌ర్సిటీ, రాజ్‌ఘ‌ర్

అడామ‌స్ యూనివ‌ర్సిటీ, కోల్‌క‌తా

యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, కోల్‌క‌తా

భువ‌నేశ్వ‌ర్ యూనివ‌ర్సిటీ, అజ్మీర్

ఎంజేఆర్‌పీ అకాడ‌మీ ఆఫ్ లా, జైపూర్

యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్నాల‌జీ, జైపూర్

మాన్‌స‌రోవ‌ర్ గ్లోబ‌ల్ యూనివ‌ర్సిటీ, సేహోర్

జీహెచ్ రాయ్‌సోనీ యూనివ‌ర్సిటీ, చింద్‌వారా

Posted Date: 16-11-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌