• facebook
  • whatsapp
  • telegram

సీమ్యాట్‌ బాటలో ...

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఏడాదిలో రెండుసార్లు దేశవ్యాప్తంగా కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (CMAT) ను నిర్వహిస్తుంది. ఈ ఎంబీఏ ప్రవేశపరీక్ష ముఖ్యాంశాలూ, సన్నద్ధమయ్యే ప్రణాళికల గురించి తెలుసుకుందామా? సీమ్యాట్‌ స్కోరును ఏఐసీటీఈ ద్వారా గుర్తింపు పొందిన 1500కు పైగా బీ-స్కూళ్లు ఆమోదిస్తాయి. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం సంస్థలకు అర్హులైన విద్యార్థులను ఈ పరీక్ష ద్వారానే ఎంచుకుంటారు.

 

2011 వరకు మనదేశంలో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాములకు సంబంధించి అనేక ప్రవేశ పరీక్షలుండేవి. CAT, JMET, ప్రత్యేకంగా రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలు, ఎంబీఏ సంస్థల సంఘాలు నిర్వహించేవి, ప్రైవేటు కళాశాలలు నిర్వహించే పరీక్షలూ. విద్యార్థులకు రకరకాల పరీక్షల భారం తప్పించాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ సీమ్యాట్‌ను ప్రవేశపెట్టింది. దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పొందినవారై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా సీమ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

పరీక్ష విధానం

సీమ్యాట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్‌) విధానంలో ఉంటుంది. కాలవ్యవధి 3 గంటలు. దీనిలో 4 విభాగాలుంటాయి.

ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లుంటాయి. అభ్యర్థి వాటిల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

 


సీమ్యాట్‌తో ప్రయోజనాలేమిటి?

1. ఆదర్శవంతం: గతంలో ఎంబీఏలో ప్రవేశానికి విద్యార్థులు అనేక ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి వేలల్లో ఖర్చూ అయ్యేది. ఈ మానసిక ఒత్తిళ్లను దూరం చేయడంతోపాటు, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులూ రాయగల పరీక్షగా దీన్ని ప్రారంభించారు.

2. చేతులకు తక్కువ శ్రమ: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కాబట్టి గంటలపాటు వ్యాసరూప ప్రశ్నలు రాయనక్కర్లేదు. టిక్‌ పెట్టడం, వృత్తాల్లో షేడింగ్‌, గుర్తించిన సమాధానాన్ని చెరిపెయ్యడం వంటి సమస్యలుండవు.

3. మూల్యాంకనానికి ఒకే వేదిక: భిన్న రాష్ట్రాలకూ, ప్రాంతాలకూ చెందిన ఎంబీఏ ఆశావహుల స్కోర్లను మూల్యాంకనం చేయడానికి ఒకే ప్రమాణం ఇది. దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలన్నింటికీ దీన్ని వర్తించే వీలు ఏర్పడింది.

4. సమతుల్య పరీక్ష: సీమ్యాట్‌లో 4 విభాగాలుండటం వల్ల సమతుల్యతకు అవకాశం ఏర్పడింది. కొందరు ప్రత్యేకంగా క్వాంటిటేటివ్‌నే బాగా చేయగలుగుతారు- లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ అంత బాగా చేయలేరు. లేదా ఇందుకు భిన్నంగా ఉండొచ్చు. ఈ పరీక్ష విభిన్న అభ్యర్థుల సామర్థ్యాలను సమతుల్యంగా అంచనా వేస్తుంది.

5. విశేషమైన జనరల్‌ అవేర్‌నెస్‌: మిగతా వాటిలాగే ఈ విభాగానికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఎంబీఏకు ఎంపికయ్యే అభ్యర్థులు బాగా చదవగల, సమాచారం తెలిసినవారై ఉంటారని నిర్ధారణ చేసే విభాగమిది.

6. క్రమంగా విస్తరణ: రాష్ట్రస్థాయి పరీక్షలతో పోల్చితే సీమ్యాట్‌ను ప్రారంభమైన కొద్ది వ్యవధిలోనే ఎక్కువ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 57 పట్టణాల్లో దీన్ని నిర్వహించారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.

 

 

సిలబస్‌ ఎలా చదవాలి?

క్వాంటిటేటివ్‌ టెక్నిక్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌:
అరిథ్‌మెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్స్యురేషన్‌- ప్రాబబిలిటీలపై క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ ప్రశ్నలుంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌- సఫిషియన్సీలో ప్రశ్నలు ముఖ్యంగా పట్టికలు, చార్టులు, గ్రాఫ్‌లపై ఉంటాయి. అభ్యర్థులు వాటిని సులభ గణిత సూత్రాలను ఉపయోగించి సాధించాలి. అరిథ్‌మెటిక్‌ చదివితే సీమాట్‌ క్యూఏ సిలబస్‌లోని ఎక్కువ భాగాన్ని పూర్తిచేసినట్లే. ఈ విభాగాన్ని బాగా చేయాలంటే నంబర్‌ సిస్టమ్స్‌, శాతాలు, లాభం- నష్టం, బారు-చక్ర వడ్డీ, వేగం, కాలం- దూరం, కాలం- పని, సరాసరి, సంక్లిష్ట సంఖ్యలు సాధన చేయాలి. నేరుగా ప్రశ్నలు అడగని అంశాల్లో ఆల్జీబ్రా ఒకటి. జామెట్రీలో ఉప అంశాలు చాలా ఉన్నాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నల్లో సమాచారం నిర్ణీత కాలవ్యవధిలోని ఒక అంశం సారూప్య ప్రదర్శనను వివరిస్తుంది. దీనిలో 4 నుంచి 5 ప్రశ్నలు టేబుల్‌/ చార్టు/ గ్రాఫ్‌లపై అడుగుతారు. అభ్యర్థులు నిరంతరం సాధన చేస్తూ విశ్లేషణ నైపుణ్యాలను, త్వరగా లెక్కించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలోని ప్రశ్నలను సాధించడానికి అభ్యర్థులు సంబంధిత సూత్రాలు, ప్రశ్నల విధానాన్ని అర్థం చేసుకోవాలి. సాధన ద్వారా శ్రవణ, పఠన నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ విభాగంలో భావన (కాన్సెప్ట్‌)ను అర్థం చేసుకోవడం ప్రధానం లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌: దీన్ని రెండు విభాగాలుగా విభజించారు.

1. పదజాల ఆధారిత ప్రశ్నలు
2. ఆంగ్ల వ్యాకరణ ఆధారిత ప్రశ్నలు.

అభ్యర్థులు యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, వాక్యాలను సరిచేయడం, వాక్య పూరణం, ఆడ్‌ వన్‌ అవుట్‌ ప్రాబ్లమ్స్‌, ఏక పద ప్రత్యామ్నాయాలు, జాతీయాలు, ఖాళీలను పూరించడం, పారా జంబుల్‌ ప్రశ్నలపై సన్నద్ధమవ్వాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌: అభ్యర్థుల ప్రాపంచిక వ్యవహారాల పరిజ్ఞానాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. భారతీయ, అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తులు, చారిత్రక విశేషాలు, భౌగోళికాంశాలు, విజ్ఞాన శాస్త్ర అంశాలు, ఆటలు, అబ్రివేషన్స్‌, వాణిజ్య అంశాలు, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించాలి. కనీసం ఒక తెలుగు, ఒక ఆంగ్ల దినపత్రికను నిత్యం చదువుతుండేవారు ఈ విభాగాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు.

Posted Date: 21-10-2020


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌