• facebook
  • whatsapp
  • telegram

మాక్‌ టెస్టులు మరవొద్దు!

సీమ్యాట్‌కు తుది మెరుగులు

 

 

మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించాలనిఅనుకునేవారు ఎంచుకునే ప్రవేశ   పరీక్షల్లో సీమ్యాట్‌ ఒకటి. రాత పరీక్ష ఫిబ్రవరిలోనే జరగబోతోంది. సన్నద్ధమయ్యేవారు ఈ సమయంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి? 

 

ప్రముఖ బీ స్కూళ్లలో చేరాలనుకునేవారు ప్రయత్నించే ప్రవేశపరీక్షల్లో కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌) ఒకటి. ఇది జాతీయస్థాయి పరీక్ష. ఒకరకంగా క్యాట్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని చెప్పొచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరగనుంది. విజయం సాధించాలనుకునేవారు తుది సన్నద్ధతలో కొన్ని కీలకాంశాలపై దృష్టిపెట్టడం తప్పనిసరి. అప్పుడే అనుకున్న విజయం సాధ్యమవుతుంది.

 

రివిజన్, రివిజన్‌

ఇంకా కొద్దిరోజుల సమయమే ఉంది కాబట్టి, పునశ్చరణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల్లోని ఫార్ములాలు, ప్రధానాంశాలను పునశ్చరణ చేయాలి. రోజులో కొద్ది సమయాన్ని తప్పకుండా వీటికి కేటాయించాలి.

 

బలాలు, బలహీనతలు

మిగతా వాటితో పోలిస్తే సీమ్యాట్‌లో ప్రశ్నల కఠినత్వస్థాయి మరీ ఎక్కువేం కాదు. చాలావరకూ ప్రశ్నలు విద్యార్థులు చేసేవిధంగానే ఉంటాయి. అయితే ఇది జాతీయస్థాయి పరీక్ష. ఇలాంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో పోటీ ఎక్కువ. ఇప్పటికే విద్యార్థులకు తమ సన్నద్ధతపై ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పటిదాకా అనుసరించిన ప్రణాళిక కాకుండా ఇప్పటి నుంచి మరోదాన్ని తయారు చేసుకుని దానికి అనుగుణంగా సన్నద్ధత కొనసాగించాలి. ముందుగా ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో వాటికి ప్రాధాన్యమివ్వాలి. కానీ కొత్త అంశాలను ప్రయత్నించకపోవడమే మంచిది.

 

కరెంట్‌ అఫైర్స్‌

జీకేలో ఎక్కువ శాతం ప్రశ్నలు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, రాజకీయ ధోరణులు, గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రధాన మార్పుల నుంచే ఉంటాయి. రోజువారీ వీటిని అనుసరించకపోయినా, రోజూ అనుసరించినా ఆరు నెలల అంశాలకు ఆన్‌లైన్‌పై ఆధారపడొచ్చు. కొన్ని వెబ్‌సైట్‌లు విద్యార్థులకు అనుగుణంగా కుదించి సమాచారాన్ని అందిస్తాయి. వాటి సాయం తీసుకోవచ్చు.

 

మాక్‌టెస్ట్‌లు

ఎంత చదివినా.. పరీక్ష సమయంలో సరైన ప్రదర్శన చేయలేకపోతే పడిన శ్రమంతా వృథా అవుతుంది. సమయం వృథా అనుకోకుండా వీలునుబట్టి మాదిరి పరీక్షలు రాయాలి. టాపిక్‌లవారీగానూ అందుబాటులో ఉంటాయి. వాటినీ ప్రయత్నించవచ్చు. కానీ పరీక్షకు కొద్దిరోజుల ముందు మాత్రం పూర్తిస్థాయిలో కొన్నయినా మాక్‌ పరీక్షలను రాసేలా చూసుకోవాలి. ఇవీ ఒకరకమైన సన్నద్ధతే.

 

వ్యూహం సిద్ధం

ఇది విద్యార్థులు తమ సన్నద్ధత ఆధారంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత తక్కువ వ్యవధిలో ఎక్కువ సమస్యలను పరిష్కరించే పద్ధతులను చూసుకోవాలి. లేదా ఏయే అంశాల్లో బలంగా ఉన్నారో వాటిని ముందుగా పరిష్కరించడం వంటి వాటిపై దృష్టిపెట్టుకోవాలి. ముందుగా ఒక్కో సెక్షన్‌ను  చేసుకుంటూ పోవడం కంటే సెక్షనల్‌ కటాఫ్‌ మార్కులపై ముందుగా దృష్టిపెట్టి, ఆపై అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా మిగతా వాటిని చేయడంపై దృష్టిపెట్టాలి. ఇందుకుగానూ జీకే, వెర్బల్, మ్యాథ్స్, రీజనింగ్‌ క్రమాన్ని పరిశీలించవచ్చు.

 

ఫ్లాష్‌ కార్డులు

సాధారణంగా సన్నద్ధతలో భాగంగా సొంత నోట్సు తయారు చేసుకోవడం మామూలే. పునశ్చరణను సులభతరం చేసుకోవడానికి దీన్నో మార్గంగా చెప్పొచ్చు. ఈ తక్కువ సమయంలో విద్యార్థుల దృష్టంతా ఎక్కువశాతం ఎలాగూ పునశ్చరణపైనే ఉంటుంది. కానీ ఇందులోని కొన్ని ఫార్ములాలు, అంశాలు కష్టంగా భావించడమో, మర్చిపోతామనుకోడమో మామూలే. అలాంటివాటిని ఫ్లాష్‌కార్డులపై రాసుకుని, తరచుగా సందర్శించే ప్రాంతాల్లో ఉంచుకోవాలి. ఇది పునశ్చరణను మరింత ప్రభావవంతం చేస్తుంది.

Posted Date: 10-02-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌