• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

ఐఐటీటీఎంలో ప్రవేశాలకు దరఖాస్తులు



పర్యటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. వీరికి మేటి శిక్షణతో కూడిన విద్యను అందించడానికి కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)లు నెలకొల్పారు. ఈ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సుల ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.


పర్యటక రంగం వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాంతాల వారీ సందర్శనీయ స్థలాలెన్నో ఉన్నాయి. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలూ ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. దీంతో ఇందులో సుశిక్షితులు ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో విద్య, మేటి ఉపాధి నిమిత్తం దేశంలో స్వయంప్రతిపత్తి సంస్థలుగా నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం.. రాత పరీక్ష, బృంద చర్చ, మౌఖిక పరీక్షలతో లభిస్తుంది. ఈ కోర్సులను జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), న్యూదిల్లీ పర్యవేక్షణలో బోధిస్తున్నారు. ఈ సంస్థల్లో మూడేళ్లకు బీబీఏ ఫీజు సుమారు రూ.2.80 లక్షలు. ఎంబీఏ రెండేళ్లకు రూ.3.40 లక్షలు అవుతుంది. ఫీజు నిమిత్తం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఈ సంస్థల్లో వివిధ వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందుతున్నాయి. కోర్సులు పూర్తి చేసుకున్న వారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యటక సంస్థలు; రిసార్టులు, క్యాటరింగ్, విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆతిథ్యంతో ముడిపడిన ఇతర విభాగాల్లో అవకాశాలు పొందుతున్నారు. విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాల ద్వారా.. మేక్‌ మై ట్రిప్, యాత్ర, ఐఆర్‌సీటీసీ, మారియట్, షెరటాన్, బామర్‌ లారీ, హాలిడే ఇన్, జెట్‌ ఎయిర్‌వేస్, హ్యాపీటూర్‌... తదితర ప్రఖ్యాత సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. 


ఎంబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ 

సీట్లు: 750. గ్వాలియర్‌లో 334, భువనేశ్వర్‌లో 112, నోయిడా 189, నెల్లూరు 75, గోవాలో 40 చొప్పున ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది. ప్రస్తుతం చివరి ఏడాది డిగ్రీ కోర్సుల్లో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.. 

ఎంపిక: ప్రవేశ పరీక్ష, బృందచర్చ, ముఖాముఖిలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ. సీయూఈటీ-పీజీ, మ్యాట్, క్యాట్, సీమ్యాట్, జాట్, జీమ్యాట్, ఆత్మా.. వీటిలో ఏదో ఒక పరీక్షలో స్కోరు సాధించినవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవేవీ లేనివారు ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. 


ఏ కోర్సులు?

బీబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌

సీట్లు: అన్ని క్యాంపస్‌ల్లోనూ 375 సీట్లు ఉన్నాయి. గ్వాలియర్‌ 112, భువనేశ్వర్‌ 75, నోయిడా 113, నెల్లూరుకు 75 కేటాయించారు. 

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: విద్యార్హతలు ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఎంపిక: ప్రవేశ పరీక్ష, బృందచర్చ, ముఖాముఖిలతో సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. సీయూఈటీ - యూజీ స్కోరుతోనూ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 


పరీక్ష ఇలా..

బీబీఏ, ఎంబీఏ రెండు కోర్సులకూ ప్రవేశ పరీక్ష స్వరూపం ఒకటే. ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ 50, వెర్బల్‌ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఉంటాయి. అన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నలే. రుణాత్మక మార్కులు లేవు. సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి.  


గమనించండి

దరఖాస్తులు: జూన్‌ 5 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.1000.

పరీక్ష తేదీ: జూన్‌ 9

పరీక్ష కేంద్రాలు: నెల్లూరు, భువనేశ్వర్,  గ్వాలియర్, నోయిడా.

వెబ్‌సైట్‌: www.iittm.ac.in/index.html


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 22-03-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌