• facebook
  • whatsapp
  • telegram

ప్రఖ్యాత సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యకు ‘మ్యాట్ ’ దారి!

ఎంబీఏలో ప్రవేశాలకు చక్కటి మార్గం

సెప్టెంబ‌ర్‌ సెషన్ దరఖాస్తులకు ప్రకటన విడుదల

ఎప్ప‌టికీ తరగని ఆద‌ర‌ణ ఉన్న కోర్సు ఎంబీఏ. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్ మెంట్ విద్యార్థుల‌కు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి. మంచి వేత‌న‌మూ అందుతుంది. డిగ్రీ త‌ర్వాత ఎంబీఏలో చేరితే భ‌విష్య‌త్తుకు బంగారు బాటలు ప‌రుచుకోవ‌చ్చు.  ఆ అవకాశాన్ని ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌(ఏఐఎంఏ) నిర్వ‌హించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ద్వారా కల్పిస్తోంది. ఈ స్కోరుతో  దేశంలోని 600 పైగా ప్రసిద్ధ విద్యాసంస్థ‌ల్లో ఎంబీఏ చేయవచ్చు. వీటిలో ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లతోపాటు బిజినెస్ స్కూళ్లు కూడా ఉన్నాయి. ఈ పరీక్షను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తారు. క్యాట్, సీమ్యాట్ తరహా ఉన్నత విద్యాసంస్థల్లో చేరడానికి మ్యాట్ మరో చక్కటి మార్గం. ఇందులో మంచి స్కోరు సాధిస్తే దేశంతోపాటు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోనూ సీటు సంపాదించుకోవచ్చు. ఈ ప‌రీక్ష‌లో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది.

తాజాగా 2021 సెప్టెంబ‌ర్ సెష‌న్‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. మ్యాట్ రాసే అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష విధానాన్ని ఎంచుకునే సౌల‌భ్యం కూడా ఉంటుంది. ఇందులో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప‌ద్ధతులుంటాయి. రిమోట్ ప్రోక్ట‌ర్డ్ ఇంట‌ర్నెట్‌బేస్డ్ టెస్ట్‌ (ఐబీటీ), డ‌బుల్ రిమోట్ ప్రోక్ట‌ర్డ్ ఇంట‌ర్నెట్‌బేస్డ్ టెస్ట్‌(ఐబీటీ), పేప‌ర్ బేస్డ్ టెస్ట్‌(పీబీటీ), పేప‌ర్ బేస్డ్ టెస్ట్ అంట్ రిమోట్ ప్రోక్ట‌ర్డ్ ఇంట‌ర్నెట్ బేస్డ్ టెస్ట్‌ (పీబీటీ+ఐబీటీ), కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ), కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిమోట్ ప్రోక్ట‌ర్డ్ ఇంట‌ర్నెట్‌ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ+ఐబీటీ) పద్ధతులు ఉన్నాయి. 

వాటిలో అభ్యర్థికి న‌చ్చిన, అనుకూలమైన విధానంలో ప‌రీక్ష రాసుకోవచ్చు. ఆస‌క్తి ఉంటే రెండు విధాలుగానూ రాసుకునే వెసులుబాటు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గీతం, విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, ధ్రువ‌, అరోరా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్‌(ఐపీఈ), ఆస్కీ, ఐఐఆర్ఎం, విశ్వ‌విశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం త‌దిత‌ర సంస్థ‌లు మ్యాట్ స్కోరుతో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నాయి.  

అర్హ‌త ఏమిటి?

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించిన‌వారు అర్హులు. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం  చ‌దువున్న‌వారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

ద‌ర‌ఖాస్తు విధానం

అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష విధానం ఐబీటీ/ పీబీటీ/ సీబీటీకి రూ.1650 చెల్లించాలి. డ‌బుల్ రిమోట్ ప్రోక్ట‌ర్డ్ ఇంట‌ర్నెట్ బేస్డ్ టెస్ట్‌(ఐబీటీ)/  పీబీటీ+ఐబీటీ/  సీబీటీ+ఐబీటీకి రూ.2750 ఫీజు క‌ట్టాలి. 

ద‌ర‌ఖాస్తు గ‌డువు 

ఐబీటీ: ఇది ఆరు విడ‌త‌ల్లో జ‌ర‌గ‌నుంది. వాటిని బ‌ట్టి ద‌ర‌ఖాస్తు గ‌డువును నిర్ణ‌యించారు. తుది గడువు సెప్టెంబ‌ర్ 9 కాగా.. చివ‌రి విడ‌త ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 12న జ‌రుగుతుంది. 

పీబీటీ: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు ఆగ‌స్టు 29 తుది గ‌డువు. అడ్మిట్ కార్డులు ఆగ‌స్టు 30న విడుద‌ల‌వుతాయి. సెప్టెంబ‌ర్ 5న పరీక్ష నిర్వ‌హిస్తారు. 

సీబీటీ: ఆగ‌స్టు 14 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 17న అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వ‌స్తాయి. ఆగ‌స్టు 21న ప‌రీక్ష జ‌రుగుతుంది. 

ప‌రీక్ష కేంద్రాలు: 

పేప‌ర్ బేస్డ్ టెస్ట్‌: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం

కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌

ప‌రీక్ష విధానం

మ్యాట్ ప‌రీక్ష ‌మొత్తం 200 మార్కులకు నిర్వ‌హిస్తారు. స‌మ‌యం రెండున్నర‌గంట‌లు ఉంటుంది. ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. లాంగ్వేజ్ కాంప్ర‌హెన్ష‌న్‌(40 ప్ర‌శ్న‌లు - 30 నిమిషాలు), ఇంటెలిజెన్స్ & క్రిటిక‌ల్ రీజ‌నింగ్‌(40 ప్ర‌శ్న‌లు - 30 నిమిషాలు), మ్యాథ‌మెటిక‌ల్ స్కిల్స్‌(40 ప్ర‌శ్న‌లు - 40 నిమిషాలు), డేటా అనాలిసిస్ & స‌ఫిషియ‌న్సీ(40 ప్ర‌శ్న‌లు - 35 నిమిషాలు), ఇండియ‌న్ & గ్లోబ‌ల్ ఎన్విరాన్‌మెంట్‌(40 ప్ర‌శ్న‌లు - 15 నిమిషాలు). ప్ర‌శ్న‌లన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప‌ది, ఇంట‌ర్, డిగ్రీ స్థాయిలోనే ప్ర‌శ్న‌లు అడుగుతారు. మ్యాథ‌మెటిక‌ల్ స్కిల్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి స్థాయికి సంబంధించినవే ఉంటాయి. ప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కులు కూడా ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానికి కోత విధిస్తారు. మాదిరి ప్రశ్నలు, మాక్‌టెస్టులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

వెబ్‌సైట్‌: https://mat.aima.in/
 

Posted Date: 22-07-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌