• facebook
  • whatsapp
  • telegram

అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

వాణిజ్యశాస్త్రం చదివిన వారికి విస్తృత అవకాశాలు

దేశంలో గత మూడేళ్ల నుంచి ఆదరణ పొందుతోన్న కోర్సుల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకాం) ముందుంటోంది. తెలంగాణలో ఈ ఏడాది బీటెక్‌ కంటే బీకాంలోనే ఎక్కువమంది చేరారు. ఆధునిక అవకాశాలు అందిపుచ్చుకునేలా కోర్సును వైవిధ్యంగా రూపొందించడం, వాణిజ్యశాస్త్రం చదివినవారికి అన్ని రంగాల్లోనూ విస్తృతంగా అవకాశాలుండటమే ఇందుకు కారణం. రెగ్యులర్‌ కామర్స్‌ కోర్సులకు సర్టిఫికేషన్లు తోడైతే బంగారం లాంటి కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యతోనూ సత్తా  చాటవచ్చు!  


తెలంగాణలో ఈ ఏడాది సుమారు 82 వేల మంది ఎంసెట్‌ కన్వీనర్, యాజమాన్య కోటాలో బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లో చేరారు. ఇతర సంస్థల్లో మరో పదివేల మంది ప్రవేశం పొందారని అంచనా. అదే సాధారణ డిగ్రీ కోర్సుల్లో దోస్త్‌తో సుమారు 2.11 లక్షల మంది చేరగా వారిలో దాదాపు 88 వేల మంది బీకాం కోర్సు ఎంచుకున్నారు. నేరుగా ఇతర సంస్థల్లో చేరినవారు సుమారు 15వేల మంది ఉంటారు. అంతేకాకుండా బీటెక్‌లో సుమారు 50 బ్రాంచీలు ఉంటాయి. కామర్స్‌లో అన్ని శాఖలు లేవు. ఒక్క తెలంగాణే కాకుండా దేశవ్యాప్తంగా బీకాంలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


ప్రతి కోర్సూ దేనికదే ప్రత్యేకం. అన్నీ సంబంధిత విభాగాల్లో సేవలందించడానికి రూపొందించినవే. వైద్యులు ఆసుపత్రుల్లో, న్యాయవాదులు కోర్టుల్లో, ఉపాధ్యాయులు విద్యాలయాల్లో ఎక్కువగా పనిచేస్తారు. కానీ కామర్స్‌ పట్టభద్రులు మాత్రం అన్ని సంస్థలకూ, అన్ని రంగాల్లోనూ అవసరమే.  భవిష్యత్తుపై భరోసా కలిగించే చదువుల్లో కామర్స్‌ కోర్సులు ముందుండటానికి... కుటీర పరిశ్రమ నుంచి కార్పొరేట్‌ సంస్థ వరకు అన్ని చోట్లా అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉండటమే కారణం. ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లోనూ లావాదేవీలు, పద్దుల కోసం ప్రత్యేక సెక్షన్లు ఉంటాయి. వీటిలో పనిచేసేవాళ్లు కామర్స్‌ నేపథ్యంతో కోర్సులు చదివినవారే. 


ఉత్పత్తి, తయారీ రంగాలు, బ్యాంకింగ్, బీమా, ఫార్మా, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్, రిటైల్, ఈ కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, మదింపు సంస్థలు, కన్సల్టెన్సీలు, అడ్వర్టైజింగ్, ఎడ్యుకేషన్, మీడియా....ఇలా అన్ని వర్తక విభాగాల్లోనూ వాణిజ్యశాస్త్ర పట్టభద్రుల అవసరం ఉంటుంది. ఆడిట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఫైనాన్షియల్‌ ప్లానింగ్, అడ్వైజరీ, స్టాక్‌ బ్రోకింగ్‌..మొదలైన సేవల్లోనూ కామర్స్‌ నేపథ్యం ఉన్నవారు రాణించగలరు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌), రాష్ట్ర స్థాయిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు (ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షల్లో కొన్ని పోస్టులకు బీకాం చదివినవారే అర్హులు. కామర్స్‌తోపాటు ప్రత్యేక కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటగలరు.


స్టాక్‌ బ్రోకింగ్‌ కోర్సులు


వాణిజ్య విద్యార్థులు స్టాక్‌ బ్రోకింగ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులవైపూ దృష్టి సారించవచ్చు. సెంట్రల్‌ డిపోజిటరీ, సెక్యూరిటీ మార్కెట్స్, డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్, కార్పొరేట్‌ గవర్నెన్స్, ఆప్షన్స్‌ ట్రేడింగ్, క్రెడిట్‌ రేటింగ్, ఫండమెంటల్‌ ఎనాలిసిస్, సెక్యూరిటీ ఎనాలిసిస్, పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ ...తదితర విభాగాల్లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లతోపాటు కొన్ని సంస్థలు సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి.  


 

ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌


గిరాకీ ఉన్నవాటిలో ఇదీ ఒకటి. ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ద్వారా ఆర్థిక నేరాలను గుర్తించగలం. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీల్లో లొసుగులను వీరు బయటకు తీస్తారు. ఆ వ్యవహారాలు సులువుగా అర్థమయ్యేలా న్యాయస్థానాల ముందు ఉంచుతారు. ఆర్థిక ఒప్పంద పత్రాలు, కంపెనీల పద్దుల ఖాతాల్లో ఏవైనా రహస్యంగా మార్పులు చేసినట్లయితే వాటిని పరిశీలించి, నిర్ధరించేది వీరే. ఇందులో గుర్తింపు కోసం సర్టిఫైడ్‌ ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ప్రొఫెషనల్‌ (సీఎఫ్‌ఏపీ) పరీక్షలో రాణించాలి. ప్రపంచంలో పలు దేశాలకు చెందిన సంస్థలు ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి. అలాగే ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ సైతం మేటి కెరియర్‌గా మారుతోంది. 


 

మరికొన్ని...


కామర్స్‌ నేపథ్యంతో బిజినెస్‌ ఎనలిటిక్స్, డేటా ఎనలిటిక్స్, డేటా సైన్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, ట్రేడ్‌ ఫైనాన్స్‌ స్పెషలిస్ట్, ఫారెక్స్‌ మేనేజ్‌మెంట్‌... తదితర కోర్సులు/సర్టిఫికేషన్లు పూర్తి చేసి సంబంధిత కొలువులో దూసుకువెళ్లొచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే బీఎడ్‌ పూర్తిచేసుకుని రాణించవచ్చు. సాధారణ గ్రాడ్యుయేట్లు పోటీపడే అన్ని పరీక్షలూ వీరు రాసుకోవచ్చు. మేటి సంస్థల్లో ఎంకాం లేదా ఎంబీఏ పూర్తిచేసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగం అందుకోవచ్చు లేదా పరిశోధన దిశగా అడుగులేసి, వ్యాపార సంస్థల్లో కీలక స్థానాలను దక్కించుకోవచ్చు. ఆంత్రప్రెన్యూర్‌గానూ అవతరించవచ్చు. 


 

సర్టిఫికేషన్లు 


బీకాం చదువుతూ లేదా దాన్ని పూర్తిచేసుకున్న తర్వాత మేటి అవకాశాలు సొంతం చేసుకోవడానికి సర్టిఫికేషన్‌ కోర్సులెన్నో ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థలు వీటిని అందిస్తున్నాయి. సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ) కోర్సును యూఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అకౌంటెన్సీ ప్రొఫెషన్లకు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌ఏసీ) ప్రపంచ స్థాయి సంస్థ. సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌ (సీపీఏ) గుర్తింపు పొందినవారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇది సీఏతో సమానమైన కోర్సు. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ) హోదా పొందితే కార్పొరేట్‌ కంపెనీలు, ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సంస్థల్లో రాణించవచ్చు. సర్టిఫైడ్‌ ట్రెజరీ ప్రొఫెషనల్, సర్టిఫైడ్‌ ఇంటర్నల్‌ ఆడిటల్‌ మొదలైన కోర్సులెన్నో ఉపాధికి బాటలు వేస్తున్నాయి. బీకాం ఆనర్స్‌ విద్యార్థులు సర్టిఫికేషన్‌ పరీక్షల్లో కొన్ని పేపర్ల నుంచి మినహాయింపునీ పొందవచ్చు.


యాక్చూరియల్‌ సైన్స్‌


ఇటీవల ఎక్కువ ప్రాధాన్యం పొందుతోన్న కోర్సుల్లో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒకటి. బీకాం చదువుతూ.. యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు పూర్తిచేసుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ) నిర్వహించే యాక్చురీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)లో అర్హత సాధించాలి. అనంతరం దశలవారీ నిర్దేశిత పేపర్లు పూర్తిచేయాలి. ఇందులో 4 దశల్లో కలిపి మొత్తం 13 పేపర్లు ఉంటాయి. వాటన్నింటినీ పూర్తిచేసుకున్నవారు నెలకు సుమారు రూ.5 లక్షలు ఆర్జించడం సాధ్యమే. ఏడాదికి రెండుసార్లు ఏసెట్‌ నిర్వహిస్తారు. 

ఇవీ స్పెషలైజేషన్లు

అకౌంట్స్, కామర్స్‌ ప్రధాన నేపథ్యంతో బీకాం కోర్సులు రూపొందాయి. అయితే ఆసక్తిని బట్టి ఎంచుకోవడానికి ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయిప్పుడు. రెగ్యులర్‌/ ఆనర్స్‌/ ట్యాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌/ అడ్వర్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌/ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌/ స్ట్రాటజిక్‌ ఫైనాన్స్‌/ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌...మొదలైనవి బీకాంలో ఎంచుకోవచ్చు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అసోసియేషన్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ), చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (సీఐఎంఏ) సర్టిఫికేషన్‌ కోర్సులను బీకాం ఆనర్స్‌తో కలిపి అందిస్తున్నాయి. బీకాంతోపాటు సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. కొన్నిచోట్ల ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్‌ మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌తో చదువుకునే అవకాశం ఉంది. బీకాం తర్వాత.. ఎంకాం, ఎంకాం ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, ఎంకాం ఫైనాన్స్, ఎమ్మెస్సీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోల్, ఎంబీఏ (ఫైనాన్స్‌) కోర్సుల్లో నచ్చినవి ఎంచుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. 

సీఏ, సీఎంఏ, సీఎస్‌..

కార్పొరేట్‌ కంపెనీల్లో మేటి అవకాశాలకు సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులు దోహదపడతాయి. వీటిని డిగ్రీలో చేరకుండానే పూర్తిచేసుకోవచ్చు. అయితే బీకాం లేదా బీకాం ఆనర్స్‌ చదువుతూ వీటిలో చేరితే మరింత ప్రయోజనం. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ కోర్సు అందిస్తోంది. ముందుగా ఫౌండేషన్‌ కోర్సులో అర్హత సాధించాలి. ఏడాదికి రెండు సార్లు దీన్ని నిర్వహిస్తారు. ఫౌండేషన్‌లో అర్హులు దశలవారీ ఇంటర్మీడియట్, ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేసుకుంటే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గుర్తింపు పొందుతారు. 

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సీఎంఏ) కోర్సు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అందిస్తుంది. ఇందులోనూ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్‌ దశలుంటాయి. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సీఎస్‌ కోర్సు నడుపుతోంది. ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసుకున్నవారు కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) హోదా పొందుతారు. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లెక్చ‌ర‌ర్ ఉద్యోగం సాధించాలంటే?

‣ కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date: 22-12-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌