• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పాసయ్యారా.. నెక్ట్స్‌ ఏంటి?

కెరియర్ ఎంచుకునే మార్గం 


 ఇంటర్మీడియట్‌ తర్వాత ఏమిటి? ఈ ప్రశ్న ప్రథమ సంవత్సరం కోర్సులో చేరినప్పుడే వేసుకోవాలి. రెండో ఏడాదిలో అందుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించాలి. ఇంటర్‌ తర్వాత ఉన్న మార్గాలన్నీ తెలుసుకుంటే వాటిలో ఏది మీకు సరిపోతుందో నిర్ణయించుకోవచ్చు. ప్రతి గమ్యమూ గొప్పదే. అయితే ఆ దారిలో ప్రయాణం మీకు అనుకూలమా కాదా  పరిశీలించుకోవాలి. ఇందుకు స్వీయ సమీక్షే కొలమానం.


  సాధారణ డిగ్రీలు, ప్రొఫెషనల్‌ కోర్సులు, వైవిధ్యమైన చదువులు.. అన్నీ ఇంటర్‌ తర్వాతే మొదలవుతాయి. వీటిలో ఇంజినీరింగ్, మెడిసిన్‌ మినహా మిగిలినవాటిలోకి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంది. అందువల్ల అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైనా అవగాహన పెంచుకుంటే ఎందులో చేరాలో సులువుగానే నిర్ణయం తీసుకోవచ్చు. అనంతరం లక్ష్య దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. 


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే వీరిలో కొంతమంది రాణించలేకపోతున్నారు. ఇష్టం లేనప్పటికీ ఒత్తిడితో వాటిలో చేరడమే ఇందుకు కారణం. ఎంపీసీ, బైపీసీల్లో భవిష్యత్తును ఆశించేవారికి మేటి కోర్సులెన్నో ఉన్నాయి. అలాగే ఈ సైన్స్‌ గ్రూపులతో ప్రయాణం వద్దు అనుకునేవాళ్లు రాణించడానికి అవకాశమున్న చదువుల సంఖ్యా తక్కువ కాదు. అందువల్ల గతంలో తప్పటడుగులు పడినప్పటికీ పూర్తిగా సమీక్షించుకుని, ఆసక్తితో అడుగులేస్తే కలర్‌ఫుల్‌ కెరియర్‌ లైఫ్‌ సొంతం చేసుకోవచ్చు.  


  ఆసక్తులు.. ప్రత్యేకతలు  

ప్రతి విద్యార్థిలోనూ ఎన్నో ప్రత్యేకత లుంటాయి. నైపుణ్యాలు, బలాలు, బలహీనతలు ఏమిటో వారికే బాగా తెలుస్తుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని గమ్యాన్ని నిర్ణయించుకోవాలి. మేటి ఎంపికతో ముందడుగేసినవారు చదువుల్లో సులువుగా రాణించగలరు. ఎంచుకోవడానికి ఆప్షన్లు ఎక్కువగా ఉన్నందున ఎందులో చేరాలో నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టమైన పనే. అన్ని వివరాలూ తెలిస్తే వాటిలో మీకు సరిపోయేది గుర్తించవచ్చు. మీ ఆసక్తులు, ప్రత్యేకతలు తెలుసుకోవాలి. బలాలను విశ్లేషించుకుని...బలహీనతలూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. చేరాలనుకున్న కోర్సు స్వరూపాన్నీ గమనించాలి. నచ్చిన కోర్సు ఎంచుకోవడం మంచిదైనప్పటికీ, అందులో.. ఉన్నత విద్య, కోర్సు అనంతరం లభించే అవకాశాలపైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా కొత్త కోర్సులు ఎంచుకున్నప్పుడు మరింత జాగ్రత్త తప్పనిసరి. 


  ఇవీ దారులు   

ఎంపీసీతో: ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌/బీఆర్క్‌), ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌ఎంఎస్, బీఎస్సీ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ (ఆర్మీ/ నేవీ), పైలట్, ఎన్‌డీఏ (నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌)

బైపీసీతో: మెడిసిన్‌ (ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్‌...), వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ. బీఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌/ ఫ్లోరికల్చర్‌. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌. బీఎస్సీ రెగ్యులర్, బీఎస్సీ- ఫారెస్ట్రీ/ ఫిషరీ సైన్స్‌/ న్యూట్రిషన్‌/ కమ్యూనిటీ సైన్స్‌. ఆప్టోమెట్రీ


  ఎంపీసీ, బైపీసీ ఇద్దరికీ: బీఫార్మసీ, ఫార్మ్‌ డీ…  

అన్ని గ్రూపులవారికీ (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ): లా, లిబరల్‌ స్టడీస్, డీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్, సీఏ, సీఎంఏ, సీఎస్‌. హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంబీఏ. బీబీఎం, బీబీఏ, బీసీఏ, బీఏ, బీఎస్‌డబ్ల్యూ. ఫైన్‌ ఆర్ట్స్, విదేశీ భాషలు, ఎయిర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లయిట్‌ స్టివార్డ్, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కోర్సులు, డిజైన్, ఫ్యాషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు, వొకేషనల్‌ కోర్సులు, ఆఫ్‌ బీట్‌ కోర్సులు, ఏఎన్‌ఎం, ఎన్‌డీఏ (ఆర్మీ) 


  ఇంటిగ్రేటెడ్‌గా   

ఇంటర్‌ విద్యార్హతతో బీఎడ్, ఎంఏ, ఎంబీఏ...మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదువుకోవచ్చు. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా పలు సంస్థలు అందించే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ చేరిపోవచ్చు. ఇందుకోసం ఆ సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాలి.  


  పేరున్న సంస్థల్లో..   

అజీం ప్రేమ్‌ జీ యూనివర్సిటీ: రెసిడెన్షియల్‌ విధానంలో బీఏ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా ఈ కోర్సులో చేరవచ్చు.  

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌: బీఏ సోషల్‌ సైన్సెస్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. 

లిబరల్‌ స్టడీస్‌: ప్రత్యేక అభిరుచి ఉన్నవారు పలు ప్రైవేటు సంస్థలు అందించే లిబరల్‌ స్టడీస్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు. క్రియా, ఆశోక, ఫ్లేమ్, జిందాల్‌...ఇలా పలు సంస్థలు ఇప్పుడు లిబరల్‌ చదువుల్లో పేరు గడించాయి. 

ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌లో చేరినప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు.  

డీమ్డ్‌ విద్యా సంస్థలూ వైవిధ్య కాంబినేషన్లతో యూజీ కోర్సులు అందిస్తున్నాయి. డిగ్రీతోపాటు సివిల్స్, గ్రూప్స్‌ లక్ష్యంగా శిక్షణ అందించే సంస్థలూ ఉన్నాయిప్పుడు. 

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీలనూ ప్రయత్నించవచ్చు.  ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచే సన్నద్ధమైతే సీటు పొందడం సులువే.


  విదేశాల్లో   

ఇంటర్మీడియట్‌ తర్వాత విదేశీ విద్యకూ అవకాశం ఉంది. యూజీ కోర్సులకు విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే ఇందుకు సన్నద్ధం కావాలి. పలు దేశాల్లో యూజీ కోర్సులకు స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ) స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. యూఎస్‌ మీ లక్ష్యమైతే అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ (ఏసీటీ)నీ పరిగణనలోకి తీసుకోవచ్చు. 


  దూరవిద్యలో   


రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సులు చదవడానికి అవకాశం లేనివారు దూరవిద్యతో దూసుకుపోవచ్చు. దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ ఈ కోర్సులున్నాయి. ఇగ్నో, బీఆర్‌ఏఓయూ ఈ విద్యలో పేరొందాయి. లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు మాత్రం రెగ్యులర్‌ విధానంలోనే డిగ్రీ కోర్సులు చదవాలి. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 



   గ్రూపు ఏదైనా వీటిలో చేరవచ్చు  


  బోధనలో భేష్‌   

ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ బోధన కోర్సుల్లో చేరవచ్చు. వీరు డీఎడ్‌ చదవడానికి డైట్‌ సెట్‌ రాసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు  డైట్‌లు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్‌ అనంతరం నాలుగేళ్ల వ్యవధితో వివిధ లు అందిస్తోన్న బీఏఎడ్, బీఎస్సీ ఎడ్‌ కోర్సులనూ చదువుకోవచ్చు.  


  న్యాయం జరిగేలా   

న్యాయవిద్య లక్ష్యమైనవారు ఇంటర్‌ అర్హతతో ముందుకెళ్లవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మార్గాలున్నాయి. రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లోకి లాసెట్, జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల్లోకి క్లాట్, ప్రైవేటు సంస్థల్లోకి ఎల్‌శాట్‌.. మొదలైన పరీక్షల్లో ప్రతిభ చూపాలి. వీటిద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీబీఏ- ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరిపోవచ్చు. 


  ఆతిథ్యం ఆహా   

ఆతిథ్య రంగంలో సేవరలందించాలనుకునేవాళ్లు, పాకశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణలో భాగం కావాలనుకున్నవారు, కళాత్మకంగా సర్దడాన్ని ఇష్టపడేవారు...వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా వీటిని చదువుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి. 


  విదేశీ భాషలు   

ప్రస్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవారికి ప్రాధాన్యం పెరిగింది. జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పర్షియన్, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇఫ్లూతోపాటు పలు విశ్వవిద్యాలయాలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థల్లో సీయూఈటీ-యూజీతో, రాష్ట్రాల్లో అయితే ఇంటర్మీడియట్‌ మార్కులతో ప్రవేశాలుంటాయి. 


  ఫుట్‌వేర్‌ కోర్సులు  

పాదరక్షల తయారీలో భాగం కావాలనుకున్నవారు, వాటి విక్రయాల్లో రాణించాలని ఆశించేవారు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లు, సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రయినింగ్‌ సంస్థల్లో చేరవచ్చు. పరీక్షలో ప్రతిభతో పలు కోర్సుల్లో అవకాశం కల్పిస్తారు.


  డిజైన్‌లోనూ   

ఇంటర్‌ అర్హతతో ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా ముఖ్యమైందే. ఐఐటీ బాంబే, గువాహటితోపాటు పలు విశ్వవిద్యాలయాలు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షతో ప్రవేశం పొందుతారు.


  ఫైన్‌ ఆర్ట్స్‌ 

పెయింటింగ్, ఫొటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్‌... మొదలైన కోర్సులెన్నో ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా అందిస్తున్నారు. వీటికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్ట్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో పైన పేర్కొన్న కోర్సులు అందిస్తున్నారు. ఇవే కోర్సులను ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, కడప లోనూ అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా చాలా యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఈ కోర్సులు చదువుకోవచ్చు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేర్చుకుంటే.. నెగ్గుకురాగలం!

‣ ఐటీబీపీలో పోలీసు కొలువులు!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

Posted Date: 25-07-2024


 

ఇంటర్ తర్వాత

మరిన్ని