• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీలో న్యాయవిద్య

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

ఐఐటీలంటే ఇంజినీరింగ్‌ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజ్‌లు, మేనేజ్‌మెంట్‌.. ఇలా భిన్న చదువులు అందిస్తున్నాయి. కొన్నేళ్లగా న్యాయవిద్య కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందిస్తోంది. ఇక్కడున్న ఎల్‌ఎల్‌బీ - ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందింది. అలాగే ఎల్‌ఎల్‌ఎంలో వైవిధ్యమైన స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. ఈ సంస్థలో చదువులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో ప్రాంగణ నియామకాల్లో సత్తాచాటుతున్నారు.

అన్ని రంగాల్లోనూ సాంకేతికత కీలకమైంది. న్యాయవిద్యలోనూ దీని ప్రాధాన్యం పెరుగుతోంది. పలు కేసుల్లో స్పష్టమైన అవగాహన పొందడానికి న్యాయశాస్త్రంలో పరిజ్ఞానంతోపాటు సాంకేతికాంశాల్లో నైపుణ్యం కీలకమవుతోంది. అలాగే సాంకేతిక సంస్థల్లో లీగల్‌ సేవలందించడానికి లాపై పట్టుతోపాటు ఐటీ చట్టాలు, ఆ రంగంలోని ఇతర అంశాలపై అవగాహన అవసరం. ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందించే న్యాయవిద్య అందుకు దోహదపడుతోంది.

ఎల్‌ఎల్‌బీ

ఎల్‌ఎల్‌బీలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ మూడేళ్ల లా కోర్సును రెసిడెన్షియల్‌ విధానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అందిస్తున్నారు. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సులో చేరినవారికి న్యాయవిద్యతో పాటు సైన్స్‌, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు.

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌లో బ్యాచిరల్‌ డిగ్రీ లేదా పీజీలో ప్రథమ శ్రేణి మార్కులతో సైన్స్‌/ ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏతోపాటు.. ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌లో యూజీ లేదా సైన్స్‌/ ఫార్మసీలో పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూలతో

పరీక్ష: మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. పార్ట్‌-1లో మ్యాథ్స్‌ ఆప్టిట్యూడ్‌ 8, సైన్స్‌ ఆప్టిట్యూడ్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ) 12 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-1కి 40 మార్కులు. దీనికి 20 శాతం వెయిటేజీ. పార్ట్‌-2లో ఇంగ్లిష్‌ 35, లాజికల్‌ రీజనింగ్‌ 10, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-2 మొత్తం 160 మార్కులు. వెయిటేజీ 80 శాతం. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలోనూ 35 శాతం మార్కులు తప్పనిసరి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు. తుది ఎంపికలో ఆన్‌లైన్‌ పరీక్షకు 70, ముఖాముఖికి 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఎల్‌ఎల్‌ఎం

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్‌ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. మరికొన్ని ప్రవేశపెడతారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 4 సెమిస్టర్లు ఉంటాయి.  

అర్హత: మూడేళ్లు లేదా ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత.  

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూలతో.

పరీక్షలో: ఎల్‌ఎల్‌బీ సిలబస్‌ నుంచి 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. ఇందులో అర్హత సాధించడానికి 35 శాతం మార్కులు తప్పనిసరి. వీరికే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు. తుది ఎంపికలో పరీక్షకి 70, ముఖాముఖికి 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

ప్రస్తుతం ఆఖరు సెమిస్టర్‌ కోర్సుల్లో ఉన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెండు పరీక్షలకూ సంబంధించి మాదిరి ప్రశ్నలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించి, ప్రశ్నపత్రంపై అవగాహన పొందవచ్చు.

ఈ రెండు కోర్సులకూ ఇంటర్వ్యూలో.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 10, సంబంధిత కోర్సుపై ఉన్న ఆసక్తి తెలుసుకోవడానికి 10, లీగల్‌ ఆప్టిట్యూడ్‌కు 10 మార్కులు కేటాయించారు.

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 20

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్లకు రూ.1500. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ పురుషులకు రూ.3000.

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 23

ఇంటర్వ్యూలు: మే 8 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులోని పరీక్ష కేంద్రాలు: వరంగల్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, ఖరగ్‌పూర్‌.

వెబ్‌సైట్‌: https://gateoffice.iitkgp.ac.in/law/index.php
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి సంస్థ‌ల్లో ఎంసీఏ!

‣ బేసిక్స్‌.. కాన్సెప్ట్స్‌.. ఫార్ములాస్‌.. అప్లికేష‌న్స్‌!

‣ ఆ స‌మాచార నిధి.. ఉద్యోగాల వార‌ధి!

‣ స‌రికొత్త‌గా డిజిట‌ల్ హ్యుమానిటీస్‌!

Posted Date: 21-03-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌