• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎంలో ఐదేళ్ల ఎంబీఏ 

మేటి సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవడానికి డిగ్రీ పూర్తయ్యేవరకూ ఆగాల్సిన పనిలేదిప్పుడు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులోకి చేరిపోవచ్చు. చాలా సంస్థలు కొన్నేళ్ల నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవలే ఐఐఎం ఇండోర్‌ ప్రకటన వెలువడింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపినవారిని కోర్సులోకి తీసుకుంటారు!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండోర్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సును 2011 నుంచి అందిస్తోంది. సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచ స్థాయి చదువులు అందించి, క్రియాశీలకమైన భావి మేనేజర్లను తయారుచేయడానికి ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. 

ఈ కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్‌ విద్యపై ఫోకస్‌ ఉంటుంది. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది. ఈ రెండేళ్లూ క్యాట్‌తో పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రాం (పీజీపీ)లో చేరిన వారి కరిక్యులమే ఐపీఎంలో చేరినవారికీ ఉంటుంది. ఐదేళ్ల కోర్సులో ఏడాదికి 3 చొప్పున 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి 3 నెలలు. మొదటి మూడేళ్లు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్, హ్యుమానిటీస్, లిటరేచర్, ఫైన్‌ ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో మేనేజ్‌మెంట్‌ అంశాలను బోధిస్తారు. రెండేళ్ల కోర్సు అనంతరం సోషల్‌ ఇంటర్న్‌షిప్, నాలుగేళ్ల తర్వాత బిజినెస్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. 

ఐదేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఫౌండేషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) డ్యూయల్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. కోర్సు ఫీజు వసతి, ఇతర సౌకర్యాలు కలుపుకుని మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.4 లక్షలు. చివరి రెండేళ్లు పీజీపీలో చేరినవారు చెల్లించే ఫీజును వసూలు చేస్తారు. 

ఎంపిక ఇలా...

ఆప్టిట్యూడ్‌ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు. అకడమిక్‌ సామర్థ్యాలు, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ గమనిస్తారు. పరీక్షలో ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, ఇంగ్లిష్, మ్యాథ్స్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించినవారికి ఐఐఎం ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖాముఖి నేరుగా లేదా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, సాధారణ అవగాహన, ఒప్పించగలిగే సామర్థ్యాలు గమనిస్తారు. 

ఆప్టిట్యూడ్‌ టెస్టు...

క్వాంటిటేటివ్, వెర్బల్‌ ఎబిలిటీల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. బహుళ ఐచ్ఛిక, లఘు సమాధాన (మల్టిపుల్‌ చాయిస్, షార్ట్‌ ఆన్సర్‌) ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. ప్రతి తప్పు జవాబుకూ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. లఘు సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ విభాగంలో 40 ప్రశ్నలను 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 20 వస్తాయి. వీటికి 40 నిమిషాల వ్యవధి ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ 40 ప్రశ్నలకు 40 నిమిషాల వ్యవధి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలను 2 గంటల్లో పూర్తిచేయాలి. పాత ప్రశ్నపత్రాలు ఐఐఎం ఇండోర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

అర్హత సాధించాలంటే?

అభ్యర్థులు సెక్షన్లవారీ అర్హత సాధించడం తప్పనిసరి. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ విభాగంలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వీరినే పరిగణనలోకి తీసుకుంటారు. ఆప్టిట్యూడ్‌ విభాగానికి 65, పర్సనల్‌ ఇంటర్వ్యూ 35 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ వెయిటేజీ ప్రకారం జాబితా రూపొందించి మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి కోర్సులోకి తీసుకుంటారు. 

సీట్ల సంఖ్య: 150

అర్హత: 2020 లేదా 2021లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు 1, 2002 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఆగస్టు 1, 1997 తర్వాత జన్మించినా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 21

దరఖాస్తు ఫీజు: రూ.4130. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.2065.  

పరీక్ష తేదీ: జులై 2

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. 

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

‣ గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

‣ ఎంత పరిధి? ఏవి ముఖ్యం?

‣ ఆర్థిక.. గణాంక.. వైద్య సేవల్లోకి కేంద్రం ఆహ్వానం!

‣ ఏ సైన్స్‌ ఎంచుకుందాం!

‣ వాయిదాలు వద్దు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 19-04-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌