• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా?

‘సెఫాలజీ’తో వినూత్న కెరియర్‌ 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. కోట్ల మంది ఓటర్లు.. లక్షల మంది నిర్వహించే ఎన్నికల ప్రక్రియ.. అసలు ఎలా ఉంటుందో అనే ఆలోచన ఎవరికైనా రాకమానదు. దీనిపై ఆసక్తి ఉండి, ఇందులో కెరియర్‌ నిర్మించుకోవాలి అనుకునే వారి కోసం ప్రత్యేకమైన కోర్సులున్నాయి. వాటిలో తర్ఫీదు పొందడం ద్వారా ‘సెఫాలజిస్ట్‌’గా తయారుకావొచ్చు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా..


సెఫాలజీ అనేది పొలిటికల్‌ సైన్స్‌లో ఒక భాగం. ఇది ఎన్నికల ప్రక్రియ, బ్యాలెటింగ్‌ను సాంకేతికంగా, గణాంకాల సహాయంతో పరిశీలిస్తుంది. ఎన్నికల ‘క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌’ను తయారుచేస్తుంది.


అవ్వడం ఎలా?

‣ సెఫాలజిస్టు అయ్యేందుకు అభ్యర్థులకు పొలిటికల్‌ సైన్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉండాలి. ఎం.ఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత అర్హత మరింతగా అవకాశాలను పెంచగలదు. అకడమిక్‌ అర్హతలతోపాటు క్రిటికల్‌ థింకింగ్, విశ్లేషణ సామర్థ్యాలు, కంప్యుటేషన్‌ స్కిల్స్‌ అవసరం అవుతాయి. 

స్టాటిస్టిక్స్‌ మీద స్థిరమైన అవగాహన ఉంటూ ఎన్నికలు, ఓటింగ్‌ సరళిని గమనించగలిగేలా ఉండాలి. 

జనాభాకు సంబంధించిన పూర్తి అంశాల మీద పట్టు ఉంటూనే.. రాజకీయంగా ఇవి ఎలా ప్రభావం చూపగలవు అనే విషయాన్ని విశ్లేషించేలా ఉండాలి.

ఇంటర్‌ తర్వాత విద్యార్థులు దీని కోసం డిగ్రీలో పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ లేదా సంబంధిత సబ్జెక్టులు చదవాలి. 

‣ పాలిటిక్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ చేశాక ఇంటర్న్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. 

చాలా మంది అభ్యర్థులు తొలుత మీడియా సంస్థల నుంచి ప్రారంభించి తర్వాత పూర్తిస్థాయి సెఫాలజిస్టులుగా మారతారు.


ఏం చేస్తారు?

సెఫాలజిస్టులు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్‌ సరళిని  అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంలో గత ఎన్నికల ఓటింగ్‌ రికార్డులు, పోలింగ్‌ శాతం, ఒపీనియన్‌ పోల్స్‌ వంటి సమాచారాన్ని వినియోగిస్తారు. పాత సమాచారాన్ని ఉపయోగిస్తూ, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ, భవిష్యత్తులో రాబోయే ఫలితాలను ఊహించడంలో వీరిది ముఖ్యపాత్ర. వీరి అంచనాలు రాజకీయ పార్టీలు, ప్రజలపై అధిక ప్రభావం చూపగలవు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న తేడాలతో వీరి అంచనాలు నిజం అవుతాయి, అందుకే వీటికి విశ్వసనీయత ఎక్కువ.

ప్రస్తుతం ఎన్నికల డేటాను పరిశీలించడానికి చాలా  విధాలైన టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఓటింగ్‌ డేటా, ఒపీనియన్‌ పోల్, క్యాంపెయినింగ్‌ ఇన్ఫర్మేషన్, ఇతర సంబంధిత డేటాను విశ్లేషిస్తాయి. ఇదంతా సెఫాలజీ.. దీన్ని సాధన చేసేవారినే సెఫాలజిస్టులు అంటారు.


ఉద్యోగాలు..

మీడియా హౌసెస్, ప్రింట్‌ మీడియా, మ్యాగజీన్స్, రిసెర్చ్‌ ఏజెన్సీస్, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్స్, పొలిటికల్‌ పార్టీలు వీరిని రిక్రూట్‌ చేసుకుంటాయి. కాలమిస్ట్, ఫ్రీలాన్స్‌ రైటర్, అడ్వైజర్, మార్కెట్‌ రిసెర్చర్‌.. ఇలా విభిన్నమైన కొలువుల్లోకి వెళ్లవచ్చు. 

చాలా వరకూ రాజకీయ పార్టీల అధినేతలు పేరుమోసిన సెఫాలజిస్టులను వారి సలహాదారులుగా  నియమించుకుంటూ ఉంటారు. ఎన్నికల సమయాల్లోనూ, ఇతర సందర్భాల్లో కూడా వారికి సెఫాలజిస్టులు సహాయకారులుగా ఉంటారు.


కష్టతరం..

నిజానికి ఇది కోచింగ్, తరగతుల కంటే కూడా వ్యక్తిగతంగా అభ్యర్థి ప్రతిభ మీద ఆధారపడి ఉండే కెరియర్‌. ఏ ఇన్‌స్టిట్యూట్‌ అయినా పూర్తిగా విజయవంతం అయ్యేలా శిక్షణ ఇవ్వలేదు. అభ్యర్థి సొంతంగా క్షేత్రస్థాయి నుంచి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇందులో పోటీ కాస్త తక్కువ. పూర్తిగా తమ రాజకీయ పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారు మాత్రమే ధైర్యంగా ఎంచుకుంటారు. కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ముందే చెప్పిన విధంగా.. ఈ అభ్యర్థులకు ఉన్న పేపర్‌ నాలెడ్జ్‌ కంటే ప్రాక్టికల్‌ పరిజ్ఞానంపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.span>

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

Posted Date: 23-04-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌