• facebook
  • whatsapp
  • telegram

వేగంగా చదివితేనే.. పాసయ్యేలా..!

లా చదవాలనుకునే విద్యార్థులు ఏటా సీఎల్‌ఏటీ (క్లాట్‌) పరీక్ష కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 22 లా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు చదవొచ్చు. ఇవేకాదు, క్లాట్‌ స్కోరును మరో 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. విద్యార్థి లా కెరియర్‌కు రాచబాట వేసే ఈ పరీక్ష జూన్‌ 19న జరగబోతోంది. దీనికెలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం.

క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌)-2022ను యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నారు. మొత్తం 150 ప్రశ్నలుంటాయి, ఒక్కోదానికీ ఒక మార్కు. తప్పు జవాబుకు 0.25 రుణాత్మక మార్కు ఉంటుంది. మొత్తం 5 విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కరెంట్‌ అఫైర్స్‌ - జనరల్‌ నాలెడ్జ్, లీగల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. యూజీ కోర్సులకు ఇంటర్‌ స్థాయిలో, పీజీ ప్రవేశాలకైతే డిగ్రీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది.

పేరాల ప్రశ్నలు... 

ఏ పోటీ పరీక్షలో అయినా ప్రశ్నలు దేనికవే ఉంటాయి. కొంతవరకూ మాత్రమే పేరాల ప్రశ్నలుంటాయి. కానీ క్లాట్‌లో మాత్రం పూర్తిగా పేరాగ్రాఫ్‌ ప్రశ్నలే ఉంటాయి. అంటే సుమారు 300 నుంచి 450 పదాలతో కూడిన ఒక పేరా ఉంటే దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని జవాబులు రాయాల్సి ఉంటుంది. అన్నీ ఇలాగే ఉండటం వల్ల విద్యార్థి వేగంగా చదవడం అనేది అత్యంత అవసరం. ఈ ఏర్పాటు ఎందుకంటే లాయర్‌ అయిన వ్యక్తి కెరియర్‌ మొత్తం పేజీలకు పేజీలు చదవడం, అర్థం చేసుకోవడం అవసరమవుతుంది. అందుకే ఆ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అనేది పరీక్షించడానికే ప్రశ్నపత్రం ఈ విధంగా ఇస్తున్నారన్నమాట.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌..

ఇందులో 450 పదాల పాసేజ్‌లుంటాయి. వాటిలో విషయం ఫిక్షన్, నాన్‌ ఫిక్షన్‌.. ఇలా ఏదైనా అవ్వొచ్చు. విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటున్నాం అనేది పరీక్షిస్తారు. అందులోని అంశాన్ని ఏ దృక్కోణంలో అభ్యర్థి చూస్తున్నాడనే విషయంపై కూడా ప్రశ్నలుంటాయి. చివరకు ఒక ముగింపు చెప్పగలరా అన్నది కూడా తెలుసుకునేలా ప్రశ్నలడుగుతారు. వీటికి జవాబులు గుర్తించడానికి అభ్యర్థి ఆంగ్లంలో చదవడం బాగా సాధన చేయాలి. కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలి. ఒకాబ్యులరీ చాలా ముఖ్యం. ఎన్ని ఎక్కువ పదాలు తెలిస్తే, అంత వేగంగా విషయం అర్థమవుతుంది, దాని వల్ల సరైన జవాబులు రాయగలరు. ఆంగ్ల వార్తాపత్రికల పఠనం చాలావరకూ ఉపకరిస్తుంది..

కరెంట్‌ అఫైర్స్‌..

ఇందులో కూడా 450 పదాల పేరాగ్రాఫ్‌లు ఉంటాయి. విషయం కేవలం నాన్‌ఫిక్షన్‌ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం, దేశంలో జరుగుతున్న ఏ విషయం గురించైనా ఆ పేరా చెబుతూ ఉండొచ్చు. అందులో ఉన్న విషయంపైనే ప్రశ్నలు అడుగుతారు. గతంలో జరిగిన విషయాలతో ప్రస్తుతానికి ఏదైనా సంబంధం ఉంటే రెండింటినీ కలుపుతూ ప్రశ్నలు ఉండొచ్చు. ఏదైనా విషయానికి న్యాయపరంగా ప్రాధాన్యం ఉంది అనుకుంటే దాని గురించి కచ్చితంగా లోతుగా తెలుసుకోవాలి. ప్రసిద్ధ కేసులు, తీర్పులను చదవాలి.

లీగల్‌ రీజనింగ్‌..

ప్రశ్నలో న్యాయపరంగా ఆలోచించాల్సిన ఏదైనా ఒక సందర్భాన్ని సృష్టిస్తారు. ఇది పబ్లిక్‌ పాలసీ, మోరల్‌ ఇష్యూ సమ్మిళితంగా ఉండొచ్చు.  దానిపైనే ప్రశ్నలుంటాయి. అభ్యర్థి లీగల్‌ సెక్షన్లవీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సమస్యను ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అనే అవగాహన తప్పనిసరి. ఈ సమాధానాలు రాయాలంటే కామన్‌ సెన్స్, నిర్ణయం తీసుకునే శక్తి అవసరం. ప్రశ్నలో చెప్పిన నిబంధనలు అర్థం చేసుకోవాలి. వాటిని సందర్భానికి అన్వయించుకోవాలి. న్యాయంవైపు నిలబడేలా ఆలోచించడం రావాలి.

లాజికల్‌ రీజనింగ్‌..

దీంట్లో 300 పదాలకు మించని పేరాలు ఉంటాయి. ఇతర పరీక్షల్లో ఉన్నట్టే ప్రశ్నల సరళి ఉంటుంది. రిలేషన్స్, అనాలిసిస్‌ చేయగలమా, ఆర్గ్యుమెంట్‌ను గుర్తించగలమా అన్నది పరిశీలిస్తారు. ప్రశ్నను విభాగాలుగా విడగొట్టి చదువుకుని అప్పుడు ఒకదానికొకటి లాజికల్‌గా అనుసంధానం చేస్తూ అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైన జవాబులు ఇవ్వగలం.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌..

గ్రాఫ్స్, డయాగ్రమ్స్, న్యూమరికల్‌ ఎబిలిటీ, పిక్టోరియల్‌ రిప్రజెంటేషన్, మ్యాథమేటికల్‌ ఆపరేషన్స్‌ వంటివి ఉంటాయి. మెన్సురేషన్, ఆల్జీబ్రా, ఇతర గణితాంశాల మీద పట్టుండాలి. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి.

అధికారిక వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వాటిని చూసే వీలు కల్పించారు. వీటి వల్ల పేపర్‌పై అవగాహన పెరుగుతుంది.

ఈ పరీక్షకు ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం చాలా అవసరం. విశ్లేషణ సామర్థ్యాల కోసం సాధన చేయాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

‣ గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

‣ వాయిదాలు వద్దు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-04-2022


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌