• facebook
  • whatsapp
  • telegram

సైబర్‌ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?

ఐటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం!


సైబర్‌ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి. ఈ రంగంలో ఉన్నతమైన కెరియర్‌ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులను పూర్తిస్థాయిలో పరిశ్రమకు సిద్ధం చేసేలా చాలా చక్కటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో, ఎలా చేయొచ్చో చూద్దాం.

సంపద పెరిగేకొద్దీ, దానిపై దాడులు పెరుగుతుంటాయి.. అందుకే దానికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. అలాగే టెక్నాలజీ, అడ్వాన్స్‌మెంట్‌ పెరిగేకొద్దీ... ఆర్థిక నేరాలు, సమాచార చౌర్యం వంటివి పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు బలమైన నైపుణ్య వ్యవస్థ అవసరం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతా ఆన్‌లైన్‌లో జరుగుతున్న నేటికాలంలో... ఈ నిపుణులకు గిరాకీ చాలా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీలో ఇప్పటికే ఉన్న డిగ్రీలు, సర్టిఫికేషన్లకు అదనంగా కొత్త తరహా కోర్సులు, కాంబినేషన్లు ఏర్పాటు చేసేందుకు విద్యాసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్, బిజినెస్, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ మార్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా ఈ చదువులు ఉండబోతున్నాయి.

 అదే దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయదలచిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యార్థులు కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్, సైబర్‌ లా, డేటా మైనింగ్, టెలి కమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్, రిస్క్‌ అనాలిసిస్‌ వంటి కాన్సెప్టులను క్షుణ్ణంగా నేర్చుకుంటారు.

 సైబర్‌ సెక్యూరిటీ అనేది కంప్యూటర్‌ సైన్స్‌లో ఒక భాగం. మొత్తం అంతా రక్షణ వ్యవస్థే అయినా... ఇందులో చాలా విభాగాలున్నాయి. దీన్ని గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుల్లో నేర్చుకునేవారు ఆపరేటింగ్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్‌ ఎస్యూరెన్స్, డిజిటల్‌ ఫోరెన్సిక్స్, కంప్యూటర్‌ ఎథిక్స్‌ అండ్‌ ప్రైవసీ, ఆబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వివిధ అంశాలు చదువుకుంటారు.


 

సంప్రదాయ రీతిలో..

విద్యార్థులు సైబర్‌ సెక్యూరిటీను ఫుల్‌టైౖం, పార్ట్‌టైం, ఆన్‌లైన్‌.. ఎలా కావాలంటే అలా చదువుకోవచ్చు. ఇప్పటికే దేశంలోని చాలా కాలేజీలు దీన్ని డిగ్రీ, పీజీ కోర్సులుగా అందిస్తున్నా... స్వల్పకాల సర్టిఫికేషన్‌ కోర్సులకూ అంతే ఆదరణ ఉంది. 

సంప్రదాయ డిగ్రీగా దీన్ని చదవాలి అనుకునే విద్యార్థులు బీటెక్‌/ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ - సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ క్విక్‌  హీల్, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్, సర్టిఫైడ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్, నెట్‌వర్కింగ్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా బీఈ - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ, బీఎస్సీ- సైబర్‌ సెక్యూరిటీ, బీసీఏ - మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సైబర్‌ సెక్యూరిటీ, బీసీఏ ఆనర్స్‌ - సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.


 

దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన విద్యాసంస్థలు అందిస్తున్న కోర్సులను పరిశీలిస్తే...

ఐఐటీ దిల్లీ - సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ 

ఐఐటీ కాన్పూర్‌ -  సర్టిఫికెట్‌్ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ, కాంప్రహెన్సివ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ 

‣ అమిటీ యూనివర్సిటీ (ఆన్‌లైన్‌) - బీసీఏ ఇన్‌ క్లౌడ్‌ అండ్‌ సెక్యూరిటీ 

ఐఐఐటీ బెంగళూరు - అడ్వాన్స్‌డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ 

నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ - ఎంబీఏ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌  

ఐఐబీఎం - మాస్టర్స్‌ ప్రోగ్రాం ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ 

కాలికట్‌ యూనివర్సిటీ - ఎమ్మెస్సీ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ


ఆన్‌లైన్లో..

అడ్వాన్స్‌డ్‌ హ్యాకర్స్, ట్రాకర్స్, సైబర్‌ క్రిమినల్స్‌.. వీళ్లందరినీ ఎదుర్కొనే నైపుణ్యాలు నేర్పించేలా ఆన్‌లైన్‌ కోర్సులు లభిస్తున్నాయి. వ్యవస్థలు - సమాచారాన్ని కాపాడటం, క్లౌడ్‌ బేస్డ్‌ సెక్యూరిటీను తయారుచేయడం వంటి వివిధ విధులు నిర్వహించేందుకు ఈ నైపుణ్యాలు పనికొస్తాయి. ఆన్‌లైన్‌లో లభించే కోర్సుల్లో వీడియోలు, ఈ-లెక్చర్చ్, లెర్నింగ్‌ కంటెంట్‌ వంటివన్నీ ఉంటాయి.

ఇందులో సిస్కో సర్టిఫైడ్‌ నెట్‌వర్క్‌ ప్రొఫెషనల్, సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, ఐఎస్‌ఏసీఏ సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆడిటర్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, ఐఎస్‌సీ సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌ వంటి కోర్సులు చెప్పుకోదగ్గవి. 

ఆన్‌లైన్‌లో లభించే కోర్సుల కాలవ్యవధి కరిక్యులమ్‌ను బట్టి 6 వారాల నుంచి 6 నెలల వరకూ ఉంటుంది. ఎడ్‌ఎక్స్, ఉడాసిటీ, ఎడ్యురేకా, ఫ్యూచర్‌లెర్న్, అప్‌గ్రేడ్, సింప్లీలెర్న్, కోర్సెరా, స్వయం వంటి ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికలు అన్నింటిలోనూ సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సులు పూర్తిస్థాయిలో లభిస్తున్నాయి.

అదనంగా...

ఈ రంగంలో రాణించేందుకు సబ్జెక్ట్‌ పరిజ్ఞానంతోపాటు అదనపు నైపుణ్యాలు కూడా అవసరం. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ప్రవేశం ఉండటం తప్పనిసరి. ఇది దాడులు ఏ విధంగా జరగవచ్చనే అంచనా ఏర్పడేందుకు సహాయపడుతుంది. అలాగే క్లౌడ్‌ సెక్యూరిటీ గురించి అవగాహన ఉండాలి. దాడుల సమయంలో దీన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. సందర్భాన్ని అనుసరించి ఎదురవ్వబోయే రిస్క్‌ను అంచనా వేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. సమాచారాన్ని ఎలా భద్రంగా ఉంచగలమనే విషయంపై అవగాహన, స్పష్టత ఉండాలి. 

ఈ కోర్సులు చేయడం సెక్యూరిటీ ఇంజినీర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ లీడ్, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ మేనేజర్, ఎథికల్‌ హ్యాకర్, ఇన్సిడెంట్‌ మేనేజర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, క్లౌడ్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌.. వంటి అనేక ఉద్యోగాల్లోకి వెళ్లవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెనడాలో కోర్సులు చేసేద్దాం!

‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Posted Date: 31-03-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌