• facebook
  • whatsapp
  • telegram

క్లౌడ్‌లో విహరిద్దామా!

కోర్సుకు పెరుగుతున్న ఆదరణ

ఐటీలో మేటి కెరియర్‌ను ఎంచుకోవాలి అనుకునేవారికి ‘క్లౌడ్‌’ ఇప్పుడొక దీటైన మార్గం. గత నాలుగైదేళ్లుగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. 2030 పూర్తయ్యేనాటికి దీని మార్కెట్‌ విలువ ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఇప్పటికే పేరుమోసిన ఐటీ సంస్థలు ఇలా క్లౌడ్‌ సర్వీస్‌లను అందించే వ్యాపారంలోకి దిగాయి. దీన్ని ఉపయోగించడం నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు.

కంప్యూటింగ్‌ సర్వీస్‌లను అందించడాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటున్నాం. సర్వర్, స్టోరేజ్, డేటాబేస్, నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, ఎనలటిక్స్, ఇంటెలిజెన్స్‌ వంటి సేవలు అందించడం ఇందులో భాగం. దీని ద్వారా వ్యాపార సంస్థలు అవి ఉపయోగించిన సర్వీస్‌లకు మాత్రమే డబ్బు చెల్లిస్తాయి. దీనివల్ల నిర్వహణ సులభతరమవుతుంది. 

ఏదైనా వ్యాపార సంస్థ వినియోగదారులకు ఆన్‌లైన్‌లో సేవలు అందించాలని నిర్ణయించుకుంటే.. అందుకోసం దాని వద్ద కొంత సరంజామా కావాలి. సర్వర్లు, నెట్‌వర్క్, వాటిని ఉపయోగించడం తెలిసిన నిపుణులు, కరెంట్‌... ఇలా చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ సమకూర్చుకున్నాక ఆ సంస్థకు ఎల్లవేళలా వాటిని ఉపయోగించాల్సిన అవసరం రావొచ్చు, రాకపోవచ్చు. ఒక్కోసారి వ్యాపారం బాగున్నప్పుడు సర్వర్ల అవసరం పెరగనూవచ్చు. ఇలా డిమాండ్‌లో హెచ్చుతగ్గులున్నప్పుడు సేవల్లో అంతరాయం కలగవచ్చు. 

ఉదాహరణకు X అనే ఒక వ్యాపార సంస్థ Y అనే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థకు తగిన అద్దె చెల్లిస్తే... Xకు కావాల్సిన ఆన్‌లైన్‌ సరంజామా అంతా Y ఏర్పాటుచేస్తుంది. X ఎంతమేరకు ఆ సేవలను వినియోగిస్తే అంతవరకే అది Yకు అద్దె చెల్లిస్తుంది. దీని వల్ల Xకు సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు పెట్టుబడి అవసరం లేకపోవడంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. Yకి ఇలా అద్దెకివ్వడం ఒక వ్యాపారం.

అలా కాకుండా ఎప్పుడూ స్థిరంగా సేవలు అందించేలా సాయపడేవే క్లౌడ్‌ సంస్థలు. ఏ స్థాయి కంపెనీలకైనా వాటికి తగిన విధంగా సేవలు అందించేలా ఈ క్లౌడ్‌ సంస్థలు తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి.

వీఎంవేర్‌: ఇదొక మల్టీ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం. ఇతర ప్లాట్‌ఫాంలతో డేటాను పంచుకోవడం, ఆపరేషన్స్‌ కొనసాగించడం ఇందులో సులువుగా చేయవచ్చు.

అజూర్‌: దీన్ని మైక్రోసాప్ట్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులోనూ దాదాపు 200కు పైగా ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లు ఉన్నాయి. ఆరోగ్యం, ఆర్థికం, రిటైల్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్రభుత్వ రంగాల్లో దీన్ని ఇప్పటికే వినియోగిస్తున్నారు. దీని డేటాబేస్‌ విధులను ఒరాకిల్‌ సంస్థ నిర్వహిస్తోంది.

విక్లౌడ్‌: ఇది సంస్థ బడ్జెట్‌ను బట్టి అతితక్కువ ఖర్చులో సేవలు అందిస్తుంది. ఫార్మా, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో దీన్ని అధికంగా వినియోగిస్తున్నారు. కస్టమర్‌ సేవల్లో ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ ఉండేలా ఐవీఆర్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తుందీ సంస్థ.

ల్యూమెన్‌: ఇందులో షెడ్యూలింగ్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్‌ సర్వర్‌ అడ్మిన్‌ పనిని ఇవి పూర్తిగా ఆటోమేటిక్‌గా చేస్తాయి.

గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌: ఇందులో దాదాపు 150 ప్రొడక్ట్‌లకు పైగా ఉన్నాయి. వీటిలో 20 ప్రొడక్ట్‌లను కొంతమేరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. సులభంగా, వేగంగా యాప్‌లను అభివృద్ధి చేయడానికీ, వ్యాపారాన్ని నిర్వహించడానికీ ఉపయోగపడేలా ఈ సేవలు ఉంటాయి. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, సప్లై చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్, విద్య వంటి వివిధ రంగాల్లో ఇది సేవలు అందిస్తోంది.

కమటేరా: బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఇవ్వడంతోపాటు అడ్వాన్స్‌డ్‌ సేవలు అందించడంలో ఈ క్లౌడ్‌కు మంచి పేరుంది. సర్వర్‌ మైగ్రేషన్, డిజాస్టర్‌ రికవరీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. 

లైనోడ్‌: లైనెక్స్‌ సర్వీస్‌లను అందించడంలో దీనిది అందెవేసిన చెయ్యి. ఏడబ్ల్యూఎస్‌ వంటి అధునాతన సేవలు అవసరం లేని చిన్న కంపెనీలకు ఇది బాగా సరిపోతుంది.

వల్చర్‌: ప్రపంచవ్యాప్తంగా 27 ప్రధాన నగరాల్లో దీని డేటాసెంటర్లు ఉన్నాయి. క్లౌడ్‌ జీపీయూ, ఆప్టిమైజ్డ్‌ క్లౌడ్‌ కంప్యూట్, క్లౌడ్‌ కంప్యూట్, బేర్‌ మెటల్‌ వంటి   సేవలు అందిస్తోంది. 

క్లౌడ్‌వేస్‌: వేగంగా నమ్మదగిన సేవలు అందించడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం కస్టమర్‌ సపోర్ట్‌ ఉంటూ తక్కువ ఖర్చులో వ్యాపార సేవలు అందిస్తుంది.

డిజిటల్‌ ఓషన్‌: వీలైనంత సులభంగా ఉపయోగించేలా దీని ఆపరేటింగ్‌ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 14 డేటా సెంటర్లు ఉన్నాయి. మిగతా క్లౌడ్‌ కంపెనీల కంటే తక్కువ ధరలకే ఇది సేవలు అందిస్తోంది.

ఏడబ్ల్యూఎస్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల నుంచి దాదాపు 200 పూర్తిస్థాయి సర్వీసులను అందిస్తోంది అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌). క్లౌడ్‌లో దీన్ని అగ్రగామిగా చెప్పవచ్చు. అప్పుడే పుట్టిన స్టార్టప్స్‌ నుంచి ఉన్నతశ్రేణి కంపెనీల వరకూ అన్నింటి అవసరాలకూ సరిపోయేలా ఇందులో సర్వీస్‌లు ఉన్నాయి.

లాభాలేంటి?

వ్యాపార సంస్థలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ చాలా సులభమైన ప్రక్రియ. దీనివల్ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లకు కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. ఇవి చాలా వేగంగా పనిచేయడం వల్ల ఎంతటి డేటాను అయినా సులభంగా ప్రాసెస్‌ చేసే వీలు కలుగుతుంది. నిర్వహణను సులభం చేయడం ద్వారా ఖర్చులు తగ్గిస్తుంది. దాదాపు ఈ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ సమర్థమైన రక్షణ పాలసీలు అనుసరించడం వల్ల భద్రతకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇందులో ప్రస్తుతం ఉన్న క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏంటో ఒకసారి పరిశీలిస్తే...

ఈ క్లౌడ్‌ను అభివృద్ధి చేసిన కంపెనీలకు, వాటి నిర్వహణ బాధ్యతలో భాగస్వామ్యం తీసుకున్న సంస్థలకు, క్లౌడ్‌ను ఉపయోగించే కంపెనీలకు... ఇలా మూడంచెల్లో నిపుణులు అవసరం అవుతారు. ఈ అన్నిచోట్లా క్లౌడ్‌ గురించి పూర్తిగా తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. పూర్తిస్థాయి శిక్షణ అనంతరం క్లౌడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ను నిర్మించి - నిర్వహించే ఆర్కిటెక్ట్, ఇంజినీర్, కన్సల్టెంట్, ఆటోమేషన్‌ ఇంజినీర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్, సెక్యూరిటీ అనలిస్ట్, అడ్మినిస్ట్రేటర్‌ వంటి పోస్టులకు ప్రయత్నించవచ్చు.

కోర్సులు...

ఇందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి సంస్థలేకాక ఇతర కంపెనీలు లెక్కలేనన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా క్లౌడ్‌ రంగంలో చేరవచ్చు. మనదేశంలో ఉన్న ప్రముఖ విద్యాలయాలు సైతం సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ఆన్‌లైన్‌ సంస్థలతో సంయుక్తంగా అందిస్తున్నాయి. ప్రాథమిక అంశాల నుంచి అడ్వాన్స్‌డ్‌ స్థాయి వరకూ నేర్పేలా వీటిని రూపొందించారు. కొన్ని ప్రైవేటు శిక్షణ సంస్థలు కూడా ఈ కోర్సులను నడిపిస్తున్నాయి. ఏ కంపెనీ క్లౌడ్‌ వినియోగించాలి అనుకుంటున్నాం అనే విషయాన్ని బట్టి కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది.

నైపుణ్యాలు..

ఇందులో కెరియర్‌ను ఆశించేవారికి జావా, జావాస్క్రిప్ట్, పైతాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టుండాలి. డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ గురించి, క్లౌడ్‌ టెక్నాలజీ పనిచేసే విధానంపై పరిజ్ఞానం కావాలి. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ అణుశక్తి విభాగంలో కొలువులు

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

Posted Date: 08-11-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌