‣ నేటి తరానికి నయా కెరియర్ అవకాశం!
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్... ఏ ఫోన్ చూసినా అంతర్జాల సౌకర్యం, బోలెడన్ని సోషల్ మీడియా యాప్‌లు. కుప్పలుతెప్పలుగా సమాచారం, లెక్కలేనన్ని వీడియోలు, కావాల్సినన్ని ఫొటోలు. ఇవన్నీ ఇంతగా లభ్యమవుతున్నాయీ అంటే వాటిని ఎవరో ఒకరు తయారుచేస్తుండాలిగా? వారే ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్’.
నిజానికి కంటెంట్ క్రియేషన్ అనేది కొత్త విషయమేమీ కాదు. 2011 తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఇది ఊపందుకుంది. మన వద్ద మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు తక్కువ ధరలకే ఇంçర్నెట్ సేవలు అందించడం మొదలయ్యాక... క్రియేటర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా గుర్తించడం ఎక్కువైంది. కరోనా పుణ్యమాని ఇప్పుడు చాలామంది దీన్ని పూర్తిస్థాయి కెరియర్‌గా మార్చేసుకున్నారు. అయితే... ఎప్పుటికప్పుడు మారుతున్న వీక్షకుల అభిరుచితో కొత్తవారికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి.
‣ రకరకాల అంశాలు: అవకాశాలతో నిండిన ఇది విస్తృతమైన సబ్జెక్టు. ‘ఫ్యూచర్ మార్కెట్ ఇన్‌సైట్స్’ అంచనాల ప్రకారం 2022 పూర్తయ్యేనాటికి ఈ రంగం మార్కెట్ విలువ సుమారు రూ.1,340 కోట్లు. 2032 నాటికి ఇది రూ.4,720 కోట్లకు చేరుకుంటుందని అంచనా!
‣ కంటెంట్ సృష్టిని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు.
1. కంటెంట్ రకం
2. వ్యాపార శైలి
3. ప్లాట్‌ఫామ్
కంటెంట్ రకం: కంటెంట్ పలు విధాలుగా ఉంటుంది. ఏ విధమైన కంటెంట్‌ను తయారు చేస్తున్నారనే దాన్ని బట్టి ఈ విభజన ఉంటుంది. రచనలు, చిత్రాలు, గ్రాఫిక్ డిజైన్స్, వీడియోలు, ఆడియోలు (పాడ్‌కాస్ట్)... ఇవి ప్రధానమైన కంటెంట్ రకాలు.
వ్యాపారశైలి: సృష్టికర్తలు ఎవరికోసం పనిచేస్తున్నారనేది రెండో విభజన. ఒక కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేవారూ ఉంటారు (మార్కెటర్లు, కంటెంట్ స్ట్రాటజిస్ట్‌లు, సోషల్ మీడియా మేనేజర్లు ఈ కోవలోకి వస్తారు). లేదా సొంతంగా పనిచేసుకునేవారూ ఉంటారు.
ప్లాట్‌ఫామ్: ఏ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ సృష్టిస్తున్నాం అనేది మూడో విభజన. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, లింక్డిన్... ఇవేకాకుండా ఇతర మాధ్యమాలు, వెబ్‌సైట్లకూ కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సొంతంగానూ బ్లాగులు, ఈ-పుస్తకాల వంటివి రాయొచ్చు.
ప్రారంభించడం ఎలా?
‣ సృష్టించాలి అనుకున్న సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా అన్నీ తెలుసుకోవాలి. వినోద సంబంధిత కంటెంట్ తయారుచేసే వారికంటే... ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇచ్చే వారికి ఇది మరింత అవసరం. విద్యాసంబంధిత అంటే చదువు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఏ విషయం అయినా సరే... ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రతి అంశం ఎడ్యుకేషనల్ కంటెంట్ కిందకే వస్తుంది. అగ్గిపెట్టె దగ్గర్నుంచి, హెలికాప్టర్ దాకా ఇదే సూత్రం వర్తిస్తుంది.
‣ అదే వినోద సంబంధిత కంటెంట్ ఇచ్చేవారికి... బలమైన స్క్రిప్ట్ అవసరం. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేటర్ల మధ్య పోటీ ఎక్కువ. దాన్ని తట్టుకుని నిలబడేలా మన ప్రణాళిక ఉండాలి.
‣ ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎలాంటి కంటెంట్ సృష్టించాలి అనుకుంటున్నారో తొలుత నిర్ణయించుకోవాలి. తయారుచేసే విషయాన్ని బట్టి ఒక్కోదానికి ఒక్కో మాధ్యమం నప్పుతుంది. ఉదాహరణకు చిత్రాలకు ఇన్‌స్టాగ్రామ్ అయితే... వీడియోలకు యూట్యూబ్‌లాగ. అందరికీ అన్నింటిలోనూ ఖాతాలు ఉన్నా... ప్రధానంగా ఒక్క మాధ్యమంపైనే ఫోకస్ ఉంటుంది.
‣ డిజిటల్ కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ గురించి ఇప్పుడు చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యుడెమీ, కోర్సెరా, సింప్లీలెర్న్ వంటి ఆన్‌లైన్ సంస్థలు కంటెంట్ సృష్టితోపాటు... రచన, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, యూట్యూబ్ ఆడియన్స్ గ్రోత్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉంచాయి. వీటిలో చేరడం ద్వారా అవసరమైన నైపుణ్యాలు పొందవచ్చు.
రాణించాలంటే...
‣ అలరించేలా చెప్పడం: ఇక్కడ ఏ విషయాన్ని అయినా అర్థమయ్యేలా, ఆసక్తి పెంచేలా, అలరించేలా చెప్పడం ప్రధానం. దీనికి ‘స్టోరీ టెల్లింగ్’ నైపుణ్యాలు కావాలి అంటారు నిపుణులు. ఇది వీక్షకులకు మనల్ని మరింత దగ్గర చేస్తుంది.
‣ టెక్నికల్ అంశాలు: పనిచేస్తున్న మాధ్యమాన్ని అనుసరించి రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో - ఆడియో ఎడిటింగ్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా సంస్థలతో కాకుండా సొంతంగా పనిచేసే వారికి ఇవి కచ్చితంగా తెలియాల్సిన విషయాలు.
‣ వ్యూహం: ఈ రంగంలో రాణించిన వారంతా తమకంటూ ఒక శైలి ఉన్నవారే. అలా ఉన్నప్పుడే మిగతావారికంటే మనం భిన్నంగా కనిపిస్తాం. దానికి తగిన వ్యూహం, నిరంతర సాధన తప్పనిసరి.
‣ ‘హబ్ స్పాట్’ కథనం ప్రకారం.. సోషల్ మీడియాపై అంతగా దృష్టి పెట్టని బ్రాండ్ల కంటే... ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్న బ్రాండ్లకు వినియోగదారులు అధికంగా ఆకర్షితులు అవుతున్నారట. అందువల్ల ఈ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం కంటెంట్ క్రియేటర్లపైన ఆధారపడుతున్నా యి. దీంతో క్రియేటర్‌గా ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే... బ్రాండింగ్, కొలాబరేషన్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వ్యక్తిగతంగా లభించే గుర్తింపు ఉండనే ఉంది!
‣ భావప్రకటన మెలకువలు: కొత్తతరహా అంశాలను ముందు మన బృందానికి, తర్వాత వీక్షకులకు చెప్పేటప్పుడు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అవుతాయి. అప్పుడే అనుకున్న ఫలితం కనిపిస్తుంది.
‣ వీక్షకులను అర్థం చేసుకోవడం: వయసు, ప్రాంతం, వృత్తి, కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి వీక్షకులు పలు విధాలు. మన కంటెంట్ ఎవరిని ఉద్దేశించినది అనే విషయాన్ని బట్టి... వారిని అర్థం చేసుకుని, తగిన విధంగా విషయసృష్టి జరగాలి. వీక్షకులు తొలిసారి దేన్నయినా చూడటం తేలికే... కానీ రెండోసారి వారిని మళ్లీ రప్పించాలి అంటే వారిని అర్థం చేసుకోవడం, అంచనా వేయడం తప్పనిసరి.
‣ పెద్ద సంస్థలతో పనిచేసే వారు సొంతంగా అన్నీ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, అందుకోసం బృందం ఉంటుంది. సొంతంగా చేసేవారు అన్నీ తామే చూసుకునేలా నిర్వహణ నేర్చుకోవాలి.
‣ అనుసరణలు, నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ఇందులో మరో ప్రధాన అంశం. దానికి తగిన శ్రమపడాలి.
ఎవరు వీరు?
వినియోగదారులు/వీక్షకుల కోసం విద్య/వినోదాత్మక సమాచారాన్ని సృష్టించే వారిని ‘కంటెంట్ క్రియేటర్స్’ అంటున్నారు. ఇది ఏ ఫార్మాట్‌లో అయినా ఉండొచ్చు, ప్రధానంగా డిజిటల్‌గా ఉంటుంది. వీరు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల కోసం పనిచేయొచ్చు లేదా సొంతంగా తమకు నచ్చిన బాటలో పయనించవచ్చు. మంచి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే... ఈ కింది లక్షణాలు ఉండటం తప్పనిసరి.
‣ ఆకట్టుకునే ఆలోచనలు చేయడం, దాన్ని సమర్థంగా చెప్పేలా స్క్రిప్ట్ రాసుకోవడం.
‣ క్రియేటివ్ బృందంతో కలిసి పనిచేయడం, ఆలోచనకు తగిన విధంగా అంతిమ ఉత్పత్తి వచ్చేలా కృషి చేయడం.
‣ కంటెంట్‌ను ప్రచారం చేసుకోవడం, మార్కెట్‌ను పెంచుకోవడం
‣ వీక్షకులతో దగ్గరగా ఉండటం... వారిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకోవడం.
‣ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, దానికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవడం.
‣ వేగంగా సాధన : డిజిటల్ మాధ్యమాల్లో ఈరోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు. అందువల్ల దేన్నయినా త్వరగా అర్థం చేసుకోవడం, వేగంగా సాధన చేయడం ఇందులో చాలా ముఖ్యం. అలాగే చుట్టూ జరిగే అంశాలపై అవగాహన ఉండాలి. అప్పుడే కంటెంట్ బాగుండటంతోపాటూ మనమూ అప్‌డేటెడ్‌గా ఉండగలుగుతాం.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్!
‣ పిలుస్తోంది.. ఫ్యాషన్ ప్రపంచం!