• facebook
  • whatsapp
  • telegram

కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

వృత్తి విద్యా వివరాలు

కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి దిశగా అడుగులేయడానికి వృత్తివిద్యా (ఒకేషనల్‌) కోర్సులు దారి చూపుతాయి. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారూ వీటిని ఎంచుకోవచ్చు. ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఫుడ్‌ టెక్నాలజీ, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్, అగ్రికల్చర్, బ్యాంకింగ్, మీడియా...ఇలా వివిధ రంగాలు, విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి! 


కోర్సు పూర్తయిన వెంటనే అదనపు శిక్షణ అవసరం లేకుండా సంబంధిత విభాగంలో సేవలందిస్తోన్న సంస్థల్లో చేరిపోయి, రాణించగలగడం ఒకేషనల్‌ విద్య ప్రత్యేకత. అభివృద్ధి చెందిన దేశాలెన్నో ఈ తరహా చదువులకు ఎప్పటినుంచో అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మన దేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థను నెలకొల్పింది. దీనిద్వారా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు అందిస్తోంది. వివిధ రంగాలు, అందులోని విభాగాల అవసరాలను తీర్చి, సమర్థ మానవ వనరుల రూపకల్పన, స్వయం ఉపాధి లక్ష్యంతో ఈ వృత్తివిద్యా కోర్సులు రూపొందించారు. ప్రాంతాల వారీ స్థానిక అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలోని పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా కళాశాలలు సంబంధిత విభాగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. పనిని పరిశీలించడం, స్వయంగా పూర్తిచేయడం ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అనువర్తనానికి (అప్లికేషన్‌) అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకోసం సమీపంలోని పరిశ్రమలతో సంస్థలను అనుసంధానం చేస్తారు.  


ఈ చదువులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏ తరహా పరిశ్రమలో సేవలు అందించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, అందుకు తగ్గ కోర్సులను ఎంచుకోవాలి. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకునే అవకాశం వీరికి లభిస్తుంది. చాలా సంస్థలు టైలర్‌ మేడ్‌ విధానంలో కోర్సు, శిక్షణ అందిస్తున్నాయి. దీంతో చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా విధుల్లో చేరిపోవచ్చు. 


సాధారణ గ్రాడ్యుయేట్లు పోటీ పడే అన్ని ఉద్యోగాలకూ ఒకేషనల్‌ డిగ్రీలు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (ఎంవోక్‌) కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు మార్గదర్శనం చేస్తోంది. ఎన్‌ఎస్‌డీసీ యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాతో లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకున్నట్లు. 


డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌లో బ్యాచిలర్‌ కోర్సులు ఎక్కువగా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో పలు ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విద్యా సంస్థల్లోనూ బ్యాచిలర్‌ స్థాయిలో ఒకేషనల్‌ కోర్సులున్నాయి. ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌తో చాలా సంస్థలు అవకాశం కల్పిస్తాయి. కేంద్రీయ సంస్థల్లోని యూజీ ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రవేశం సీయూసెట్‌తో లభిస్తుంది.   


 

ఇవీ కోర్సులు


మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ...ఆటోమొబైల్స్, అగ్రికల్చర్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బయో మెడికల్‌ సైన్సెస్, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలిసిస్, ప్రొడక్షన్‌ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్, జర్నలిజం, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌.. తదితర కోర్సులు ఎంచుకోవచ్చు.  


 

జాతీయ స్థాయిలో...


స్కూల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌: ఒకేషనల్‌ చదువులకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌వీయూ) దేశంలో పేరున్న సంస్థ. అగ్రికల్చర్, ఆటోమోటివ్, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్, క్యాపిటల్‌ గూడ్స్, చైల్డ్‌ కేర్, డయాలసిస్‌ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబిల్డ్‌ సర్వీసెస్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మాస్యూటికల్, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్, రినవబుల్‌ ఎనర్జీ, ట్రావెల్‌ అండ్‌ టూరిజం విభాగాల్లో పలు కోర్సులను ఈ సంస్థ తరఫున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలవారీ అందిస్తున్నారు. ఏపీ, తెలంగాణల్లోని కొన్ని చోట్ల టిస్‌కు అనుబంధంగా శిక్షణ పొందవచ్చు. హెల్త్‌కేర్‌లో భాగంగా మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, డయాలసిస్‌ టెక్నాలజీ, పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 16 సెక్టార్లలో 34 కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఏడాది చదువు పూర్తిచేసుకుంటే డిప్లొమా, రెండేళ్లు చదివితే అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, మొత్తం కోర్సు పూర్తిచేసుకంటే బ్యాచిలర్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు.  


సావిత్రిబాయి ఫూలే పుణె యూనివర్సిటీ: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌లో జ్యూయలరీ డిజైన్‌ అండ్‌ జెమాలజీ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సులో చేరినవారు క్యాడ్, క్యామ్‌ టెక్నాలజీతో బంగారు ఆభరణాలు డిజైన్‌ చేయడం, సహజ, సింథటిక్‌ జెమ్స్‌ గుర్తించడం...మొదలైనవాటిని తెలుసుకుంటారు. జెమాలజిస్ట్, జ్యూయలరీ డిజైనర్, ఆస్ట్రిజన్, జమ్‌ కట్టర్, డైమండ్‌ కట్టర్, డైమండ్‌ గ్రేడర్‌..తదితర ఉద్యోగాలు దక్కుతాయి. 


బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: ఒకేషనల్‌ విధానంలో పలు రకాల కోర్సులు అందిస్తుంది. సీయూ సెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది.


కొత్తగా ఏర్పడిన 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనూ ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చేరే అవకాశం సీయూసెట్‌తో లభిస్తుంది. ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌లో భాగంగా టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ కోర్సులు అందిస్తున్నారు.  


తేజ్‌పూర్‌ యూనివర్సిటీ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 


లఖ్‌నవూ యూనివర్సిటీ: రెన్యువబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ


అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ: ప్రొడక్షన్‌ టెక్నాలజీ, పాలిమర్‌ అండ్‌ కోటింగ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ అండ్‌ గార్మెంట్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 


 

తెలంగాణలో..


 సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, హైదరాబాద్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అందిస్తోంది. సైన్స్‌ విద్యార్థులకు ఇండస్ట్రియల్‌ మైక్రో బయాలజీ కోర్సు ఒకేషనల్‌ విధానంలో నడుపుతోంది. 


 హిందీ మహా విద్యాలయ, హైదరాబాద్‌ (ఓయూ రోడ్‌): హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్, ప్రాక్టికల్‌ అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌లో బీ.వోక్‌. కోర్సులు అందిస్తోంది. 


 

ఆంధ్రప్రదేశ్‌లో..


 సెయింట్‌ థెరిసా అటానమస్‌ విమెన్స్‌ కాలేజీ, ఏలూరు: క్లినికల్‌ అండ్‌ ఆక్వా ల్యాబ్‌ టెక్నాలజీ, వెబ్‌ టెక్నాలజీ అండ్‌ మల్టీ మీడియా.  


 పిఠాపురం రాజా గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్, కాకినాడ: ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌


 వైఎన్‌ అటానమస్‌ కాలేజ్, నర్సాపురం: హెల్త్‌కేర్‌ అండ్‌ నర్సింగ్, ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారెల్‌ డిజైనింగ్, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ మల్టీ మీడియా (డిప్లొమా) 


 వీఎస్‌ఎం కాలేజ్, రామచంద్రాపురం: ఆక్వా కల్చర్‌ 


 పీవీఆర్‌ ట్రస్ట్‌ డిగ్రీ కాలేజ్, కాకినాడ: హార్టికల్చర్, ఫుడ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్, క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ఇమేజ్‌ టెక్నాలజీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్‌ డిజైన్‌


 గవర్నమెంట్‌ అటానమస్‌ కాలేజ్, రాజమహేంద్రవరం: రెన్యువబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌. 


 ఐడియల్‌ కాలేజ్, కాకినాడ: సస్టయినబుల్‌ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.


 కాకరపర్తి భావనారాయణ కాలేజ్, విజయవాడ: వెబ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌. 


 వీఆర్‌ మెమోరియల్‌ కాలేజ్, గుంటూరు: మల్టీమీడియా అండ్‌ వెబ్‌ డిజైన్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ల్లో డిప్లొమాలు. కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌లో బీవోక్‌. 


 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి: ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారెల్‌ డిజైనింగ్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్స్‌.


ఏపీ, తెలంగాణలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు ఒకేషనల్‌లో.. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

Posted Date: 14-10-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌