• facebook
  • whatsapp
  • telegram

ఎంబీఏ ఇంటర్వ్యూ.. ఎదుర్కొందాం ఇలా..

* మేనేజ్‌మెంట్‌ సీట్ల సాధనకు సూచనలు


ఐఐఎంలూ, దేశంలోని టాప్‌ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ప్రవేశాల కోసం మౌఖిక పరీక్ష, బృంద చర్చ/ గ్రూప్‌ ఎక్సర్‌సైజు, రిటన్‌ ఎబిలిటీ టెస్టులు ఆరంభమవుతున్నాయి. క్యాట్‌- 2023, జాట్‌ లాంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో  కనీస కటాఫ్‌లు సాధించిన గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులు వీటికి అర్హులు. ప్రవేశపరీక్షల స్కోరుకు 25- 50 శాతం మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. దీనితో పాటు మౌఖిక పరీక్షల్లో ప్రతిభ, ప్రొఫైల్‌ స్కోరుల ఆధారంగానే ప్రసిద్ధ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ సీట్లు లభిస్తాయి.  


సాధారణంగా ఇంటర్వ్యూలు ఒక్కో అభ్యర్థికి 15- 30 /40  నిమిషాల పాటు నిర్వహిస్తారు. 10 నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్యానలిస్టులుగా 2-5 మంది సభ్యులు (పురుషులు, మహిళలు) ఉంటారు. ప్రముఖ ఐఐఎంలు/ బీ స్కూల్స్‌ ఆఫ్‌-లైన్‌లోనే మౌఖిక పరీక్షలను  నిర్వహిస్తాయి.


బృంద చర్చలు  

సమకాలీన అంశాలపై లేదా మేనేజ్‌మెంట్‌/ ఇతర సబ్జెక్టులపై టాపిక్‌ ఇచ్చి కొంతమంది అభ్యర్థులను గ్రూపులుగా విభజించి చర్చించమని చెపుతారు. ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకొని, చర్చను మీరే ప్రారంభిస్తే ఒక సానుకూలాంశం అవుతుంది. అయితే ఇచ్చిన అంశంపై అవగాహన ఉంటేనే ప్రారంభించడం మంచిది. లేకుంటే ఇతరులు మాట్లాడుతున్నది సావధానంగా విని అర్థం చేసుకోవాలి. వారు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా ప్రతిస్పందించాలి. వాదనలకు దిగరాదు. ఇక్కడ మీ లిసనింగ్‌ నైపుణ్యాలు, బృంద, నాయకత్వ లక్షణాలను అంచనా వేస్తారు.


ఎలాంటి టాపిక్‌లు అడగవచ్చు?

ఆబ్‌స్ట్రాక్ట్‌ టాపిక్స్‌: ఇవి వినూత్నంగా ఉంటాయి. సృజనాత్మకతకు పరీక్ష పెడతాయి. ఉదాహరణకు రెడ్‌ వర్సెస్‌ గ్రీన్, మైథాలజీ వర్సెస్‌ మేనేజ్‌మెంట్, జీరో వర్సెస్‌ శూన్య.

జనరల్‌ అవేర్‌నెస్‌ టాపిక్స్‌: ఇవే టాపిక్స్, వ్యాస పరీక్ష (ఎస్సే)కు కూడా ఉపయోగపడతాయి. మూన్‌ లైటింగ్, ఏఐతో ఐటీ జాబ్స్‌కు ముప్పు, లే ఆఫ్స్‌ (ఉద్యోగుల తొలగింపు), 2024 ఎన్నికలు, ఇండియా వర్సెస్‌ భారత్, చాట్‌ జీపీటీతో సృజనాత్మకతకు ముప్పు, డీప్‌ ఫేక్, సోషల్‌ మీడియాలో నెగెటివిటీ.


 గ్రూప్‌ ఎక్సర్‌సైజులు 

ఇప్పుడు బృంద చర్చలకు బదులు వీటిని అడుగుతున్నారు. వీటిలో రోల్‌ ప్లే, ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు, కేస్‌ స్టడీ వంటి వాటిపై ఒకే గ్రూప్‌గా చర్చించాల్సి వస్తుంది. ఇచ్చిన టాస్క్‌ను బట్టి ఒక్కొక్క సభ్యుడికి ఒక్కో పనిని అప్పగించాలి/ విభజించాలి. ఇదే టీం వర్క్‌ అంటే. వీటిలో బృందచర్చలో కనబరిచే లక్షణాలతో పాటు అభ్యర్థి సహకారం, సంప్రదింపులు, ఒప్పించే నైపుణ్యాలు పరీక్షిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌ లాగా కాకుండా చర్చ చివరలో అందరూ ఏకాభిప్రాయానికి రావాలి కూడా. కొన్ని టాపిక్స్‌: మీ గ్రూప్‌ వారు మారుమూల గ్రామానికి వెళ్లి, అక్కడి నిరక్షరాస్య మహిళలకు సెర్వికల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలి/ ప్రస్తుత ట్రెండింగ్‌ అంశం రిమోట్‌ వర్కింగ్‌ వల్ల లాభ నష్టాలు?

విద్యార్థులను అడిగే ప్రశ్నలు రెండు రకాలు. 1. స్వీయ పరిజ్ఞానం: అభ్యర్థి చదువు, అర్హతలు, కుటుంబ నేపథ్యం, హాబీలు, సొంత ప్రదేశం, జీవిత లక్ష్యాలు మొదలైనవి. 2. జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్, ఆర్థిక వ్యవస్థ, పాలిటిక్స్‌ మొదలైనవి.


గతంలో తరచుగా ఐఐఎంలు ప్రశ్నలు అడిగిన అంశాలు

స్వీయ పరిచయం చేసుకోండి. (మిమ్మల్ని మీరు 30 సెకండ్లలో పరిచయం చేసుకోండి /మీ రెజ్యూమెలో మీ గురించి లేనిదాన్ని చెప్పండి. మీ బలాలు, బలహీనతలు ఏమిటి అనీ ప్రశ్నించొచ్చు).

ఎందుకు ఎంబీఏ చెయ్యాలనుకొంటున్నారు? (ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్‌ మీకు ఇష్టం?, ఈ కాలేజీ ఎంచుకోవడానికి ప్రధాన కారణం?)

మీ కెరియర్‌ లక్ష్యాలను వివరించండి (స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు)

మిగతావారితో పోల్చితే  మీకే ఈ ఎంబీఏ అడ్మిషన్‌ ఇవ్వడానికి మీకున్న ప్రత్యేక అర్హతలు ఏమిటి?

మీ జీవితంలో ప్రముఖ సంఘటనలు/ విజయాలు ఏవి? (మీ నాయకత్వ లక్షణాలకు ఉదాహరణలు? మీ జీవితంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? ఎలా అధిగమించారు?

మీ పేరుకు ఉన్న అర్థం? మీ ఊరు ప్రత్యేకతలు ఏమిటి?


పాలిటీ: మీ రాష్ట్ర గవర్నర్‌ / మీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు? దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉంది? పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి / చైనా ప్రెసిడెంట్‌ ఎవరు? భారత్‌కు విదేశాలతో ఉన్న సంబంధాలు? ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం.. 

ఎకానమీ: ఒకవేళ మీరు నిర్మలా సీతారామన్‌ని కలిసే అవకాశం వస్తే కొత్త బడ్జెట్‌పై ఎటువంటి సలహాలు ఇస్తారు?  జీడీపీ, జీఎన్‌పీ, ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ పాలసీలు, ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, పన్నులు- భావనలపై ప్రశ్నలు...

టెక్నాలజీ: చాట్‌ జీపీటీ, ఏఐ, బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ భావనలపై ప్రశ్నలు..

మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టు: ప్రాథమిక భావనలు, మార్కెటింగ్, ఆపరేషన్స్, మానవ వనరులు, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్, కన్సల్టింగ్‌...


మౌఖిక పరీక్షలో ఏం గమనిస్తారు?

1. కమ్యూనికేషన్‌ స్కిల్స్, తార్కిక జ్ఞానం

2. బృంద నైపుణ్యాలు  

3. నాయకత్వ లక్షణాలు

4. మేనేజ్‌మెంట్‌ విద్యపై కనీస పరిజ్ఞానం

5. తమ గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల ప్రాథమికాంశాలపై పట్టు 


జవాబులు ఎలా చెప్పాలి? 

అభ్యర్థులు సమాధానాలను మూస పద్ధతిలో కాకుండా సృజనాత్మకంగా చెప్పడానికి సన్నద్ధులు అవ్వాలి. ఉదాహరణకు ‘సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌’ ప్రశ్నకు కేవలం రెజ్యూమెలోనిది వున్నది ఉన్నట్లు అప్పచెప్పకుండా స్కూలింగ్‌ నుండి డిగ్రీ వరకు తనకున్న విజయాలు, నేర్చుకున్న నైపుణ్యాలు, సానుకూల దృక్పథంతో కూడిన తన వ్యక్తిత్వం గురించి చెప్పాలి. ఎందుకు ఎంబీఏ చెయ్యాలనుకొంటున్నారు? అనే ప్రశ్నకు- మేనేజ్‌మెంట్‌ వైపు మరలడానికి ప్రేరణ ఎలా వచ్చింది (వ్యాపార కుటుంబ నేపథ్యం ఉంటే దాన్ని చెప్పవచ్చు), ఎంబీఏ చేస్తే ఎలాంటి నైపుణ్యాలు మీరు అలవరచుకొంటారు? కాలేజీ ద్వారా  నెట్‌ వర్కింగ్‌ పెంచుకోవడం, ఫ్యాకల్టీతో సత్సంబంధాలు, స్టూడెంట్‌ క్లబ్స్‌తో మమేకం లాంటి వాటి ద్వారా మీ దీర్ఘకాలిక కెరియర్‌ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందనేది జవాబులో జతపరిచి ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. అంతే కానీ, ‘ఈ ఎంబీఏ ద్వారా మంచి కంపెనీలో నాకు జాబ్‌/ మంచి శాలరీ వస్తుందని ఆశిస్తున్నాను’ లాంటి పేలవమైన సమాదానాలు సరి కావు. ఇదే ప్రశ్నకు పని అనుభవం ఉన్న అభ్యర్థులు తమ కంపెనీలో ఇంతవరకు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించడం కోసం ఈ ఎంబీఏ ఒక పరిష్కారంగా చెప్పుకోవచ్చు.


15-30 నిమిషాల ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థిపై మంచి ముద్ర పడాలంటే పైన చెప్పిన ప్రశ్నలకు సరైన సమాధానాలను నోట్‌ బుక్‌లో రాసి, వాటిని కొన్ని నమూనా ఇంటర్వ్యూల ద్వారా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంటర్వ్యూ అనగానే చాలామందిలో ‘ఒత్తిడి’ ప్రభావం చూపుతుంది. దాన్నుంచి బయటపడాలంటే పైన చెప్పిన రెగ్యులర్‌ ప్రశ్నలకు రెడీమేడ్‌ సమాధానాలు ఉంటే, ఇంటర్వ్యూ సమయంలో ఆత్మ విశ్వాసంతో ఉండొచ్చు. తర్వాత ఏవైనా కొత్త ప్రశ్నలు తలెత్తినా సులువుగా ఎదుర్కొనవచ్చు. మొత్తం మీద విషయ పరిజ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం, చిరునవ్వు, సమయస్ఫూర్తి, తార్కిక జ్ఞానం, సానుకూల దృక్పథం జత అయితే ఐఐఎం/ బీ స్కూల్‌ ఇంటర్వ్యూ నెగ్గడం సులభమే. రిటన్‌ ఎబిలిటీ టెస్టు 

రాత నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యం, భావ వ్యక్తీకరణలను అంచనా వేసే వ్యాస రచన పరీక్ష. ఇచ్చిన అంశంపై  15-20 నిమిషాల్లో 250-300 పదాలతో వ్యాసం రాయాలి. వీటిలో విషయం పరిజ్ఞానం, విశ్లేషణ, తార్కిక ఆలోచన, వ్యాస నిర్మాణం, పదజాలం, ఇంగ్లిష్‌ వ్యాకరణం కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి పైన చెప్పిన టాపిక్స్, కరెంటు అఫైర్స్‌పై అవగాహన పెంచుకొని, కొన్ని నమూనా టాపిక్స్‌ సాధన చేస్తే ఈ టెస్ట్‌లో మంచి స్కోరు చెయ్యవచ్చు.


ఐఐఎం అహ్మదాబాద్‌ కొత్తగా అనలిటికల్‌ రైటింగ్‌ టెస్ట్‌ ఇస్తోంది. దీనిలో క్రిటికల్‌ రీజనింగ్‌తో కూడిన ప్రశ్నలు ఇచ్చి వాటిలో దాగివున్న అంశాలను పైకి తీసుకురావడం/ ఫలానా వాదనను బలపరచండి లేదా బలహీనపరచండి / దానికి సరైన ముగింపు అడగవచ్చు. ఈ వాదనతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు / విభేదిస్తారు? అనీ అడగవచ్చు. ఒక్కోసారి ఒక బొమ్మ చూపించి, దానిపై ప్రశ్నలు అడుగుతారు.


మొత్తం మీద- సన్నద్ధతకు మించిన తరణోపాయం మరొకటి లేదు. పైన చెప్పిన సలహాలు పాటిస్తూ పటిష్ఠంగా సాధన చేస్తే ఐఐఎంల్లో, టాప్‌ బీ స్కూల్స్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలు, గ్రూప్‌ డిస్కషన్స్‌ / రిటన్‌ ఎబిలిటీ టెస్టుల్లో నెగ్గి ఈ 2024లో మీ కలకల కాలేజీలో సీటు సంపాదించవచ్చు!   


 

- శ్రీధర్, 

డైరెక్టర్, కౌటిల్య, తిరుపతి 

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

 

Posted Date: 15-02-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌