• facebook
  • whatsapp
  • telegram

మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

జాతీయస్థాయి లా అడ్మీషన్ టెస్ట్‌ సీఎల్ఏటీ 

దేశమంతా రోజూ ఎన్నో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కోట్ల మంది జరిపే కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎన్నో వివాదాలు.. అటువంటి సందర్భాల్లో వినియోగదారుడి హక్కులు కాపాడటంలోనూ, వ్యాపార సంస్థలు సక్రమరీతిలో వాణిజ్యం జరిపేలా చూడటంలోనూ ‘వినియోగదారుల చట్టం’ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ కన్స్యూమర్‌ లా ప్రాక్టీస్‌ చేసే లాయర్లకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయి.

ప్రధానంగా వినియోగదారులకు మేలు చేస్తూ వారి ప్రయోజనాలు కాపాడేదే  కన్స్యూమర్‌ లా. దోపిడీకి గురిచేసే వ్యాపారాల నుంచి వారిని ఈ చట్టం కాపాడుతుంది. అసంబద్ధమైన ధరల నుంచీ, అనైతిక విధానాల నుంచీ రక్షణ కల్పిస్తుంది. దేశంలో ఉన్న ఏ సంస్థ ఎటువంటి ఉత్పత్తి లేదా సేవను అందించినా.. అవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిలోని లోటుపాట్లపై వినియోగదారులు దీని ద్వారా ప్రశ్నించవచ్చు. అన్యాయం జరిగిందని నిర్థరణ అయితే కోర్టులు తగిన విధంగా పరిహారం చెల్లించేలా ఆ సంస్థలను ఆదేశించగలవు. ఈ మొత్తం ప్రక్రియలో కన్స్యూమర్‌ లాయర్‌ కీలక పాత్ర పోషిస్తారు. 

ఈ న్యాయవాది వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తారు. సాధారణంగా వీరు సమాజంలో సురక్షితం కాని వస్తువులు అమ్మకుండా, కల్తీ జరగకుండా, కంపెనీలు ఎక్కువ ధరలు విధించకుండా.. అన్ని విధాలుగా రక్షణ కల్పించేలా పనిచేస్తారు. కొనుగోలుదారుల హక్కుల కోసం కోర్టులో తమ వాదనలు వినిపిస్తారు.


విధులు: ఒక సంస్థలో కన్స్యూమర్‌ లాయర్‌ భిన్న విధులు నిర్వహిస్తారు. క్రెడిట్‌ అగ్రిమెంట్స్‌ చేయడం, కోర్టు లావాదేవీల్లో పాల్గొనడం, వాయిదాల సమయాల్లో రిప్రజెంట్‌ చేయడం వంటి పనులుంటాయి. అదనంగా వీరు డిజైనర్లు, మాన్యుఫాక్చరర్లు, ఇంపోర్టర్లు, రిటైలర్లు, వినియోగదారులతో కలిసి ఉత్పత్తి రక్షణ, జవాబుదారీకి సంబంధించిన పనులు చూస్తారు. కన్స్యూమర్‌ లాయర్లకు చిన్న చిన్న విషయాలను గుర్తించి, స్పందించగలిగే గుణం ఉండాలి. వీరు ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తూ పని చేయాలి.

కన్స్యూమర్‌ లాయర్లు కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ అందుకున్నాక కెరియర్‌లో ముందుకు అడుగులు వేయొచ్చు. బిజినెస్, అకౌంటింగ్, ఫైనాన్స్‌ వంటి సబ్జెక్టులు నేర్చుకోవడం వృత్తిలో మరింత ఉపయోగపడుతుంది. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, హౌసింగ్‌ సేఫ్టీ వంటివి తెలుసుకోవడానికి సివిల్‌ జస్టిస్‌ స్పెషలైజేషన్‌ ఉపయోగపడుతుంది. డిగ్రీ పూర్తవుతూనే ఇంటర్న్‌షిప్స్, సంస్థల్లో వాలంటీర్‌గా పనిచేయడం వల్ల ఎటువంటి విభాగంలో పనిచేయాలి అనుకుంటున్నారు అనేదానిపై అవగాహన కలుగుతుంది. కన్స్యూమర్‌ అడ్వకేట్‌లో గ్రాస్‌రూట్‌ ఆర్గనైజర్, పాలసీ అనలిస్ట్, ఔట్‌రీచ్‌ కోఆర్డినేటర్‌.. వంటి పలు పోస్టుల్లోకి వెళ్లొచ్చు. ప్రభుత్వ, సేవా సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో పనిచేయవచ్చు. వీరిని అధికంగా సోషల్, సివిక్, పొలిటికల్‌ గ్రూపులు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ప్రిడేటరీ లెండింగ్, క్రెడిట్‌ రిపోర్టింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్‌ ఇటువంటి వాటిపై వినియోగదారులను అప్రమత్తం చేయడంలో వీరి పాత్ర కీలకం.


ఇంకా వీరికి ఈ కింది చోట్ల మంచి అవకాశాలున్నాయి.  


అడ్వొకసీ గ్రూప్స్‌: ఇందులోని సభ్యులు వినియోగదారుల హక్కుల కోసం పోరాడే ‘పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ ఆర్గనైజేషన్స్‌’ కోసం పనిచేస్తారు. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో వ్యక్తుల తరఫున వాదిస్తారు. చట్టాల్లో మార్పుల కోసం పనిచేస్తారు. 


పెద్దస్థాయి లా ఫర్మ్స్‌: కన్స్యూమర్‌లాతో అధిక శాతం పనిచేసే వాటిలో పెద్ద పెద్ద బ్యాంకులు, క్రెడిట్‌ ఇన్‌స్టిట్యూషన్లు ఉంటాయి. వారి లీగల్‌ అవసరాలు ఎక్కువగా ఉండటం వల్ల తరచూ టీమ్‌ అవసరం అవుతుంది. ఇటువంటి సంస్థలు కన్స్యూమర్‌ అవసరాలను, హక్కులను తెలుసుకుని పనిచేయడంలో లాయర్లు సాయపడతారు. 


చిన్నస్థాయి లా ఫర్మ్స్‌: చిన్న సంస్థలు, వ్యక్తిగతంగా ప్రాక్టీస్‌ చేసే వారు వ్యక్తుల కోసం పనిచేస్తారు. చిన్న చిన్న క్రెడిట్‌ కార్డు వివాదాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ప్రొడక్ట్‌ లయబిలిటీ కేసుల వరకూ ఇందులో ఉంటాయి. వ్యక్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు తాలూకా వివాదాల పరిష్కారం కోసం వీరు కృషి చేస్తారు. 


ఇన్‌హౌస్‌ కౌన్సెల్‌: కన్స్యూమర్‌ లాయర్లు నేరుగా క్రెడిట్‌ కంపెనీల కోసం పనిచేయవచ్చు. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు, ఇతర మాన్యుఫాక్చరర్లు లా ఫర్మ్స్‌తో సంబంధం లేకుండా నేరుగా లాయర్లను విధుల్లోకి తీసుకుంటాయి. చట్టాలు అమలయ్యేలా చేసేందుకు, ఫిర్యాదుల పరిష్కారం ఈ సందర్భంలో కృషి చేస్తారు. 


సొంతంగా: కార్పొరేషన్లు, కన్స్యూమర్లు.. ఇద్దరికీ కన్స్యూమర్‌ లా అవసరం ఉంటుంది. వినియోగదారులకు అలవికాని ధరలు, విధానాల నుంచి రక్షణ కావాలి. కార్పొరేషన్లు ఈ చట్టాలను పాటిస్తూనే తమ వ్యాపారం నిర్వహించేందుకు లాయర్ల అవసరం ఉంటుంది. ఒకపక్క వినియోగదారుల హక్కులను కాపాడుతూనే మరోపక్క వ్యాపారాలు ప్రశాంతంగా జరిగేలా వీరు చూస్తారు. కొందరు లాయర్లు పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ కోసం పనిచేస్తారు. మరికొందరు కార్పొరేట్‌లో పనిచేస్తూ స్థిరమైన కెరియర్‌ నిర్మాణం కోసం కృషి చేస్తారు.


ప్రవేశ పరీక్షలు..: ఇందుకోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ లేదా ఏదైనా డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బీ చదవాలి. అనంతరం పీజీలో కన్స్యూమర్‌ లా స్పెషలైజేషన్‌ ఎంచుకోవాలి.


ఏపీ లాసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌ కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌), టీఎస్‌ లాసెట్‌ (తెలంగాణ స్టేట్‌ కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌).. పరీక్షలతో తెలుగు రాష్ట్రాల్లో న్యాయవిద్య కళాశాలల్లో ఈ కోర్సును చదవచ్చు. (ప్రస్తుతం రెండు పరీక్షలకూ ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో ఉంటాయి) 


సీఎల్‌ఏటీ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ ): ఇది జాతీయ స్థాయిలో ఉన్న కళాశాలల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష. ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతశ్రేణి లా కళాశాలల్లో చదివే వీలుంటుంది.


ఇందులో పనిచేసేందుకు ఉన్న విభాగాలు..

‣  ఇండిపెండెంట్‌ కన్స్యూమర్‌ లా ప్రాక్టీస్‌

‣  డిస్ట్ర్టిక్‌ ఫోరం: జిల్లా కేంద్రం

  స్టేట్‌ ఫోరం: రాష్ట్ర రాజధాని 

  నేషనల్‌ ఫోరం: సుప్రీం కోర్ట్‌ కాంప్లెక్స్‌ వెలుపల.


‣  లా ఫర్మ్స్‌లో అసోసియేట్‌ /ప్రిన్సిపల్‌ అసోసియేట్‌ ఫర్‌ కన్స్యూమర్‌ లా /ప్రొడక్ట్‌ లయబిలిటీ ప్రాక్టీస్‌

‣ లిటిగేషన్‌ లాయర్‌ 

మాన్యుఫాక్చరర్స్‌ కంపెనీల్లో ఇన్‌హౌస్‌ కౌన్సెల్‌ 

ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో లీగల్‌ మేనేజర్‌

ఇండిపెండెంట్‌ లీగల్‌ కన్సల్టెంట్‌ / వివిధ మాన్యుఫ్యాక్చరర్లకు లీగల్‌ అడ్వైజర్‌

ఉన్నతశ్రేణి సంస్థలకు కన్స్యూమర్‌ కాంట్రాక్ట్‌ స్పెషలిస్ట్‌ 

ఎన్జీవోలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కన్స్యూమర్‌ అడ్వొకసీగా పనిచేయవచ్చు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!

Posted Date: 25-04-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌